ప్రముఖ సాఫ్ట్‌వేర్ సంస్థ మైక్రోసాఫ్ట్ తన ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్ సేవలకు ఇక సెలవు ప్రకటిస్తున్నట్లు వెల్లడించింది. వచ్చే ఏడాది.. అంటే 2022 జూన్ 15వ తేదీ నుంచి ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్ సేవలను నిలిపివేయనున్నట్లు ప్రకటించింది. అందుకు బదులుగా విండోస్ పీసీల్లో కేవలం మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ బ్రౌజర్ మాత్రమే అందుబాటులో ఉంటుందని తెలిపింది.
మైక్రోసాఫ్ట్ సంస్థ 1995లో తన విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్‌లో తొలిసారిగా ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్‌ను అందించింది. తరువాత వచ్చిన విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్‌లలోనూ దీన్ని బండిల్‌గా కొనసాగించారు. అనేక సార్లు కొత్త వెర్షన్ అప్‌డేట్‌లను అందించారు. అయితే మొజిల్లా ఫైర్‌ఫాక్స్, గూగుల్ క్రోమ్, ఓపెరా వంటి బ్రౌజర్లు ఎక్కువ పోటీని ఇవ్వడంతో ఆ పోటీ ముందు ఇంటర్నెట్ ఎక్స్ ప్లోరర్ నిలబడలేకపోయింది. దీంతో ఆ బ్రౌజర్‌కు సహజంగానే యూజర్ల ఆదరణ తగ్గింది.
అయితే ఈ ఏడాది ఆగస్టు 17వ తేదీ నుంచి మైక్రోసాఫ్ట్ 365 యాప్స్‌కు ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్ సపోర్ట్‌ను నిలిపివేస్తారు. తరువాత వచ్చే ఏడాది జూన్ 15వ తేదీ నుంచి ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్‌ను పూర్తిగా నిలిపివేస్తారు. ఆ తరువాత విండోస్ పీసీల్లో యూజర్లకు కేవలం ఎడ్జ్ బ్రౌజర్ మాత్రమే అందుబాటులో ఉంటుంది. మైక్రోసాఫ్ట్ సంస్థ 2015లో ఎడ్జ్ బ్రౌజర్‌ను అందుబాటులోకి తెచ్చింది. అయితే ఎడ్జ్ బ్రౌజర్‌లోనూ ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్ లాంటి సేవలను పొందవచ్చని మైక్రోసాఫ్ట్ తెలియజేసింది.