సముద్ర గర్భాల్లో పురాతన నగరాలు, పట్టణాలకు చెందిన శిథిలాలు బయట పడుతుండడం సహజమే. ఒకప్పుడు భూమిపై ఉన్న అలాంటి ఎన్నో ప్రాంతాలు నేడు సముద్ర గర్భంలో కుంగిపోయాయి. అయితే తాజాగా అరేబియా సముద్రంలో ఓ మిస్టరీ ద్వీపాన్ని గుర్తించారు. అది సముద్ర గర్భంలో ఉన్నట్లు గూగుల్ మ్యాప్స్‌లో కనిపిస్తోంది.
చెల్లన్నం కర్షిక టూరిజం డెవలప్‌మెంట్ సొసైటీకి చెందిన అధ్యక్షుడు, న్యాయవాది కేఎక్స్ జులప్పన్ గూగుల్ మ్యాప్స్‌లో ఆ అనుమానాస్పద దీవిని గుర్తించారు. దీంతో ఆ విషయాన్ని వెంటనే ఆయన కేరళ యూనివర్సిటీ ఆఫ్ ఫిషరీస్ అండ్ ఓషియన్ స్టడీస్‌కు తెలియజేశారు.
అయితే అదే ప్రాంతంలో సముద్రాన్ని చూస్తే అక్కడ ఎలాంటి దీవి లేదు. కానీ గూగుల్ మ్యాప్స్‌లో మాత్రం బీన్ ఆకారంలో దీవి పై నుంచి కనిపిస్తోంది. ఈ క్రమంలో అసలు అది దీవేనా ? లేక ఏదైనా కుంగిపోయిన పురాతన పట్టణమా ? అని సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. కాగా ఆ దీవి పొడవు సుమారుగా 8 కిలోమీటర్లు కాగా వెడల్పు 3.50 కిలోమీటర్లు ఉన్నట్లు గుర్తించారు.
ఇక ఆ ప్రాంతాన్ని ప్రస్తుతం సైంటిస్టులు పరిశీలిస్తున్నారు. ఈ క్రమంలోనే దాని గురించి పూర్తి వివరాలు తెలియనున్నాయి. అయితే సముద్ర గర్భంలో పలు మార్పులు ఏర్పడడం వల్ల అందులో ఉండేవి పై నుంచి చూస్తే అలా కనిపించే అవకాశం ఉందని అంటున్నారు.