ఇకపై డేటా మరింత సురక్షితం.. పర్సనల్ డేటా ప్రొటెక్షన్‌ బిల్లు 2022 ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం

-

డేటా ప్రొటెక్షన్‌ అనేది ఈరోజుల్లో పెద్ద టాస్క్‌గా మారింది..డేటా ప్రైవసీలేదు..చోరీలు జరుగుతున్నాయి. ప్రస్తుతం యూజర్లకు సంబంధించిన సమాచారానికి రక్షణ కరవైంది. అన్ని రకాల సేవలు ఇప్పుడు ఆన్‌లైన్‌లో లభిస్తున్నాయి. ఈ సేవలు పొందడానికి వినియోగదారులు తమకు సంబంధించిన కొంత సమాచారాన్ని ధ్రువీకరించాల్సి వస్తుంది.. ఇలా యూజర్ల డేటాను స్వీకరించిన కంపెనీలు.. వ్యాపారానికి వినియోగిస్తున్నట్లు సమాచారం. వెబ్‌సైట్లలో పొందుపరిచిన వివరాల్ని సంబంధిత సంస్థలు తీసుకొని, అడ్వర్టయిజ్‌మెంట్‌ ఏజెన్సీలకు అమ్ముకోవడం లాంటివీ చేస్తున్నాయి. పర్సనల్‌ డేటా ప్రొటెక్షన్‌ ఇప్పుడు పెద్ద సవాలుగా మారింది. ఇలాంటి తరుణంలో ప్రభుత్వం కొత్త బిల్లును తీసుకొచ్చేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే ఉన్న బిల్లు స్థానంలో డిజిటల్‌ పర్సనల్‌ డేటా ప్రొటెక్షన్‌ బిల్‌ 2022ను తీసుకొచ్చే పనిలో పడింది.. ఈ కొత్త బిల్లులోని కీలక అంశాలు ఇలా ఉన్నాయి..

వచ్చే పార్లమెంట్ సెషన్‌లో బిల్లు ప్రవేశం..

ఆగస్ట్‌లో ఓ పర్సనల్‌ డేటా ప్రొటెక్షన్‌ బిల్‌ని ప్రభుత్వం విత్‌డ్రా చేసుకుంది. దాని స్థానంలో ఈ కొత్త బిల్లును తీసుకురానుందని సమాచారం.. వచ్చే పార్లమెంటు సెషన్‌లో బిల్లు ప్రవేశపెట్టనుంది. ప్రస్తుతం డ్రాఫ్ట్‌ బిల్లుకు అవసరమైన మార్పులు సూచించవచ్చని మినిస్ట్రీ ఆఫ్‌ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ప్రజలను కోరింది. ఫీడ్‌బ్యాక్‌ని MyGov వెబ్‌సైట్‌లో అందించవచ్చని తెలిపింది. దీనిపై మరింత నిశితంగా లీగల్‌ ఫ్రేమ్‌ వర్క్‌ చేస్తున్నట్లు తెలిపింది. ఇప్పటికే ఈ బిల్లులో నాలుగు సార్లు మార్పులు చేసింది. 2017 లో ‘ప్రైవసీ అనేది ప్రతి భారతీయుడి ప్రాథమిక హక్కు’ అని సుప్రీం కోర్టు చెప్పింది. అప్పటి నుంచి డేటా ప్రొటెక్షన్‌ లా కోసం ప్రభుత్వం గ్రౌండ్‌ వర్క్‌ చేస్తూ వస్తుంది.

డేటా ప్రొటెక్షన్‌ బోర్డ్‌ ఏర్పాటు

ప్రభుత్వం ఓ ‘డేటా ప్రొటెక్షన్‌ బోర్డ్‌’ని ప్రారంభించనుంది. ఈ చట్టం కింద వచ్చే ఫిర్యాదులను ఈ బోర్డ్‌ పర్యవేక్షిస్తుంది. వినియోగదారుల నుంచి వచ్చే కంప్లెయింట్లను కూడా పరిష్కరిస్తుంది. దీనికి “డేటా ప్రొటెక్షన్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఇండియా”గా నామకరణం చేయనున్నారు. ఈ బోర్డ్‌ ద్వారా కంప్లెయింట్‌లు స్వీకరిస్తారు. హియరింగ్‌ కోసం గ్రూప్‌లను సైతం ఏర్పాటు చేస్తారు. విచారణ తర్వాత నిర్ణయాలు చెప్తారు. డేటాను ప్రాసెస్‌ చేసే రాష్ట్ర ఏజెన్సీలకు ప్రభుత్వం ఈ బిల్లు నుంచి మినహాయింపు ఇచ్చింది. జాతీయ భద్రతా కారణాల దృష్ట్యా వీటిని ఈ చట్టం పరిధిలోకి తీసుకురావడం లేదు.

ఆడిటర్‌ ఉండాలి..

పెద్ద మొత్తంలో డేటాను ప్రాసెస్‌ చేసే కంపెనీలు కచ్చితంగా ఓ డేటా ఆడిటర్‌ని నియమించుకోవాల్సి ఉంటుందట… ఈ నూతన చట్టం కింద వచ్చే ఫిర్యాదులను ఆ ఆడిటర్‌ పరిశీలిస్తారు.. ఆన్‌లైన్‌లో డేటా తీసుకుని ఆఫ్‌లైన్‌లో వాడుకునే పద్ధతి ఉంది. ఇలాంటి సమాచారాన్ని కొందరు ఇతర దేశాలకు ట్రాన్స్‌ఫర్‌ చేస్తున్నారు. ఇలాంటి సమాచారం వినియోగించుకొని వివిధ ప్రొడక్టులకు సంబంధించిన సెల్లింగ్‌ సర్వీసులను యూజర్లకు ఆఫర్‌ చేస్తున్నారు. ఇలాంటివన్నీ కూడా దీని కిందికే వస్తాయి.

ఎక్కువ కాలం స్టోర్‌ చేయకూడదు

కస్టమర్ల నుంచి తీసుకున్న పర్సనల్‌ డేటాను ఎక్కువ కాలం సర్వర్లలో స్టోర్‌ చేయకూడదు.
బిజినెస్‌ అవసరాల నిమిత్తం డేటాను స్టోర్‌ చేయాల్సి వస్తే యూజర్లకు తమకు సంబంధించిన డేటాను తొలగించడానికి, సవరించడానికి అవకాశం కల్పించాలి.
కంపెనీలు తమ దగ్గరకు వచ్చే డేటాకు అత్యుత్తమ భద్రత కల్పించాల్సి ఉంటుంది.
ఈ విషయంలో కంపెనీలు విఫలమైతే పెద్ద మొత్తంలో పెనాల్టీలను ఎదుర్కోవాల్సి వస్తుంది.

పిల్లల డేటా వినియోగానికి అనుమతి ఉండాల్సిందే..

పిల్లల డేటాపై ఈ బిల్లులో మరింత కట్టుదిట్టమైన నిబంధనలు ఉన్నాయి. పిల్లలకు హాని కలిగించేలా వారి డేటాను ఎక్కడా వినియోగించకూడదు. వారిని టార్గెట్‌ చేస్తూ ఎక్కడా అడ్వర్టైజింగ్‌ కూడా చేయకూడదు. పిల్లల పర్సనల్‌ డేటాను ప్రాసెస్‌ చేయడానికి తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరిగా ఉండాలని బిల్లులో ప్రాధానంగా పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news