ప్రముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్ (Telegram) తన యూజర్లకు మరిన్ని కొత్త ఫీచర్లను అందుబాటులోకి తెచ్చింది. ఇకపై యూజర్లు గ్రూప్ వీడియో కాల్స్ చేసుకోవచ్చు. స్క్రీన్ షేర్, యానిమేటెడ్ ఎమోజీస్ వంటి ఫీచర్లు కొత్త అప్‌డేట్‌లో లభిస్తున్నాయి. టెలిగ్రామ్‌కు చెందిన ఐఓఎస్, ఆండ్రాయిడ్, డెస్క్‌టాప్ యాప్‌లలో ఈ ఫీచర్లను యూజర్లు పొందవచ్చు. ఇక టెలిగ్రామ్ యాప్‌లో యూజర్లు తమ గ్రూప్ వాయిస్ చాట్స్ ను వీడియో కాన్ఫరెన్స్ కాల్స్ గా మార్చుకోవచ్చు.
వీడియో కాల్‌లో ఉన్నప్పుడు యూజర్లు ఇతరులను పిన్ చేస్తే వారు కూడా ఆ కాల్‌లో చేరవచ్చు. ఇక ఫోన్‌లో ఉన్న దేన్నయినా చూపించాలంటే యూజర్లు టెలిగ్రామ్ యాప్ ద్వారా స్క్రీన్‌ను షేర్ చేయవచ్చు. ఈ క్రమంలో యూజర్లు కెమెరా ఫీడ్, స్క్రీన్ ఫీడ్‌ను ఒకేసారి షేర్ చేయవచ్చు.
టెలిగ్రామ్ అందిస్తున్న గ్రూప్ వీడియో కాల్ ద్వారా ఒకేసారి 30 మంది మాట్లాడుకోవచ్చు. త్వరలో ఈ పరిమితిని మరింత పెంచనున్నట్లు టెలిగ్రామ్ ప్రతినిధులు తెలిపారు. ఇక ట్యాబ్లెట్లు, కంప్యూటర్లలోనూ టెలిగ్రామ్ యాప్ ద్వారా యూజర్లు గ్రూప్ వీడియో కాల్స్ చేసుకోవచ్చు.
ఈ సందర్భంగా టెలిగ్రామ్ సీఈవో పవెల్ దురోవ్ మాట్లాడుతూ యూజర్లకు మరిన్ని సౌకర్యాలను అందించేందుకే తాము యాప్ కొత్త అప్‌డేట్‌లో పైన తెలిపిన ఫీచర్లను అందుబాటులోకి తెచ్చామని తెలిపారు. వాయిస్ కాల్స్ మాట్లాడేటప్పుడు యూజర్ల బ్యాక్‌గ్రౌండ్ నుంచి అవతలి వారికి శబ్దాలు వినిపించకుండా నాయిస్ సప్రెషన్ అనే ఫీచర్‌ను కూడా మరింత మెరుగు పరుస్తున్నామని తెలిపారు.