ప్రముఖ మైక్రో బ్లాగింగ్ ప్లాట్ ఫామ్ ట్విటర్ లో సాంకేతిక సమస్య ఎదురైంది. అనేక దేశాల్లో ట్విటర్ సేవలకు అంతరాయం కలిగింది. చాలా మంది యూజర్లు తమ ట్విటర్ ఖాతాల్లోకి లాగిన్ అవ్వలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇవాళ మధ్యాహ్నం 3.50 గంటల సమయంలో ఈ సమస్య ఎదురైనట్లు తెలుస్తోంది.
ఖాతా ఫీడ్‌లో ఉండే ట్వీట్లు కనిపించడం లేదని యూజర్లు ఫిర్యాదు చేస్తున్నారు. ఇందుకు కారణమేంటని ఇంకా తెలియలేదు. అంతర్జాల సేవల్లో అవాంతరాలను కనిపెట్టే ‘డౌన్ డిటెక్టర్’ వెబ్సైట్ ప్రకారం.. ట్విటర్ క్రాష్‌కు సంబంధించి వేలాది కంప్లైంట్స్ వచ్చాయి. ట్విటర్ ఓపెన్ చేయగానే.. ‘ట్వీట్స్ ఇప్పుడు లోడ్ కావడం లేదు’ అనే సందేశం కనిపిస్తోందని కొందరు యూజర్లు చెబుతున్నారు. మరికొందరికి ‘వెల్కమ్ టు ట్విటర్’ అనే మెసేజ్ మాత్రమే కనిపిస్తోందని అంటున్నారు.
ట్వీట్లు చేయడానికి మాత్రం ఎలాంటి సమస్య లేదని తెలుస్తోంది. ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉన్న హ్యాష్‌ట్యాగ్స్ సైతం కనిపిస్తున్నాయి. ఒక్క ఫీడ్‌కు సంబంధించిన సమస్యే ఇది అని టెక్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.ఈ సమస్య అమెరికా, యూకే, జపాన్, భారత్‌లో తలెత్తినట్లు సమాచారం. మొబైల్‌తో పాటు డెస్క్‌టాప్ వెర్షన్ సైతం క్రాష్ అయినట్లు యూజర్లు చెబుతున్నారు.