ఇతరులపై ఆధారపడితే జీవితం ఎలా ఉంటుందో తెలిపే కథ..

జీవితంలో కష్టాలు రావడం కామనే. కష్టం వస్తేనే కదా లైఫ్ లో కిక్కు వచ్చేది. జీవితంలో ఎలాంటి కష్టం రాకుమ్డా సాఫీగా సాగిపోతూ ఉంటే జీవించామన్న ఫీలింగ్ కూడా ఉండదు. ఐతే చాలా మంది కష్టాలంటేనే భయపడతారు. అందుకే ఛాలెంజిలకి దూరంగా ఉంటారు. అలాంటి వాళ్ళందరూ జీవితంలోని అందమైన అనుభవాలని మిస్సవుతుంటారు. కష్టం కావాలన్నాను కదా అని చెప్పి, కోరి కోరి కష్టాలు తెచ్చుకొమ్మని కాదు. మనకు తెలియకుండా వచ్చే కష్టాలకు తట్టుకుని ధైర్యంగా నిలబడాలని చెప్పడమే. కష్టపడకపోతే జీవితం ఎలా ఉంటుందో తెలిపే అద్భుతమైన కథ.

ఒకానొక తోటలో విపరీతమైన సీతాకోకచిలుకలు తిరుగుతుండేవి. అక్కడకి వెళ్ళిన వారు సీతాకోక చిలుకలు పుట్టడాన్ని చూస్తూ ఆశ్చర్యపోయేవారు. అలా అక్కడకి వచ్చిన ఒక వ్యక్తి, గొంగళి పురుగు నుండి సీతాకోక చిలుక బయటకు రావడాన్ని చూస్తున్నాడు. సీతాకోక చిలుక బయటకు రావడానికి అది బాగా కష్టపడుతుంది. దాని కష్టాన్ని చూసిన ఆ వ్యక్తి, సీతాకోక చిలుకకి సాయం చేయాలని, ఈజీగా బయటకు వచ్చేలా చేస్తాడు. ఎలాంటి ఇబ్బంది లేకుండానే బయటకి వచ్చిన సీతాకోక చిలుక ఎంతసేపటికి ఎగరకపోవడంతో ఏమైందని ఆలోచించసాగాడు.

కొద్ది సేపయ్యాక అది చిన్నగా ఎగరడం ప్రారంభించింది. కానీ ఎంత ప్రయత్నించినా ఎక్కువ ఎగరలేకపోతుంది. ఇలా ఎందుకవుతుందని ఎంత ఆలోచించా అతనికి అర్థం కాలేదు. కొంచెం అలోచించి ఉంటే అసలేం జరిగిందనేది అర్థమై ఉండేది. దాని మానాన ఏదో అవస్థలు పడి బయటకు వచ్చి ఉంటే, ఎగరగలిగే శక్తి వచ్చేది. కానీ అంత కష్టపడకుండా బయటకు రావడంతో దానికి ఎక్కువ దూరం ఎగరలేని పరిస్థితి ఏర్పడింది.

మీ జీవితంలో కష్టాలు వస్తే అవి మిమ్మల్ని మరింత బలంగా చేయడానికే తప్ప, మిమ్మల్ని అధఃపాతాళానికి తోసేయడానికి కాదు. అందుకే ఏ కష్టం వచ్చినా ఇతరులపై ఆధారపడవద్దు. డేర్ టూ డూ మోటివేషన్ ఆధారంగా.