ప్రయత్నమే విజయానికి తొలి మెట్టు.. స్పూర్తినిచ్చే కథ

-

అనగనగా శివశ్చంద్రుడనే రాజు, ఆయనకు రాజేంద్రుడనే కుమారుడు, లేక లేక కలిగిన సంతానం కావడంతో అల్లారుముద్దుగా పెంచుకుంటాడు. విద్యాభ్యసం కోసం ఒక ముని ఆశ్రమానికి పంపిస్తాడు. ఒకనొక శుభదినాన విద్యాభ్యాసం పూర్తిచేసుకుని వస్తాడు రాజేంద్రుడు. ఇక తన కుమారుడికి పట్టాభిషేకం చేద్దామనుకుంటాడు శివశ్చంద్రుడు. దానికి రాజేంద్రుడు కూడా సంసిద్ధత వ్యక్తం చేస్తాడు. ఇక శివశ్చంద్రుడు తన కుమారుడికి రాజ్యాన్ని చూపించాలనుకుని మారువేశంలో వెళతారు.

తమ రాజ్యంలోని అన్ని ప్రాంతాలు తిరుగుతూ తమ రాజ్యం ఎంతో బాగుందనుకుంటూ ముందుకు సాగుతారు. అంతలో కొందరు దోపిడీ దొంగలు నానా భీభత్సం చేస్తూ దోచుకుంటుంటారు. ఇక శివశ్చంద్రుడు కూడా తన కుమారుని ప్రతిభను చూసే సమయం వచ్చిందనుకుంటూ రాజేంద్రుడిని ఆదేశిస్తాడు.. కుమారా దోపిడి దొంగలనుండి మన ప్రజలను కాపాడు అని. రాజేంద్రుడు తను కత్తి తీసుకురాలేదని, వెళ్ళి తీసుకురమ్మంటూ సైనికులకు చెబుతాడు. వెళ్ళిన సైనికులు ఒక ఖడ్గంతో తిరిగి వస్తారు. అది చూసిన రాజేంద్రుడు ఈ ఖడ్గం అంత బరువు లేదు, పదును కూడాతక్కువగా ఉంది, పిడి కూడా సరిగ్గా లేదు.. మన రాజముద్ర కూడా దానిమీద ఉండాలంటూ అలాంటి ఖడ్గం తీసుకురమ్మని పురమాయిస్తాడు.

శివశ్చంద్రుడికి ఏమీ అర్థం కాదు.. దోపిడి దొంగలు దోచుకు వెళ్ళిపోతున్న సమయంలో వారు అక్కడ చెప్పులు కుట్టుకుంటున్న ముసలి వ్యక్తి దగ్గరి గల్లా పెట్టెను తీసుకోబోతారు. అంతే మెరుపు వేగంతో ఆ ముసలాయన తన చేతిలో ఉన్న చెప్పులు కుట్టే చిన్న కత్తితో వారిపై దాడి చేస్తారు. ఆశ్చర్యపోయిన రాజు అలా చూస్తూ ఉంటాడు. దోపిడీ దొంగలు ఆ చెప్పులు కుట్టే ముసలి వ్యక్తిపై దాడి మొదలు పెడతారు. ఆ ముసలి వ్యక్తి ఏమాత్రం వెనక్కు తగ్గకుండా తన దగ్గరున్న కత్తి, సూదీ, మట్టి, రాళ్ళు ఏవి దొరికితే వాటితో దాడి చేస్తుంటాడు. ఇదంతా చూస్తున్న వారు ఆ ముసలాయనకు ఒక కొడవలి విసురుతారు.. ఆ కొడవలితో వారిపై తిరగబడతాడు. ఆ ముసలి దైర్యాన్ని చూస్తున్నమిగిలిన వారు కూడా ప్రేరణ పొంది ఆ దోపిడీ దొంగలపై తిరగబడటంతో ఆ దొంగలు పారిపోతారు.

ఇదంతా చూస్తూ ఆలోచనలో పడ్డ రాజు మంగళవాయిద్యాల శబ్దానికి వెనక్కి తిరిగి చూస్తాడు.. అదే రాజేంద్రుడు యుద్ధం చేయడానికి కావాల్సిన ఖడ్గం తయారు చేసి తీసుకువస్తున్నారు భటులు.. రాజేంద్రుడి ప్రతాపం చేసిన రాజు శివశ్చంద్రుడు తన రాజ్యానికి కావాల్సింది ఎవరో నిర్ణయించుకుంటాడు. పరుగున వెళ్ళి ఆ ముసలి వ్యక్తిని హత్తుకుని, నా రాజ్యానికి రాజు కావాల్సింది నువ్వే అంటూ ఆ ముసలి వ్యక్తిని రాజుగా ప్రకటిస్తాడు..

ఈ కథలో నీతి ఏంటంటే.. ఆ ముసలి వ్య్తక్తి కి మొదట ఉన్న చిన్న కత్తితో పోరాటం చేస్తాడు.. అది చూసిన వారు వారి సాయంగా కొడవలి అందిస్తారు. కొంత సమయానికి మిగిలిన వారందరూ మద్దతు ఇస్తారు..

మనం ఏదైనా మెదలు పెడితే రావాల్సినవన్నీ వాటంతట అవే వస్తాయి. నా దగ్గర మంచి ప్లాన్‌ ఉంది కానీ డబ్బులేదు..ఆ డబ్బే ఉంటే పెద్ద బిజినెస్‌ పెట్టేవాన్ని అలాగే చాలామందికి ఉద్యోగాలు ఇచ్చే వాన్ని.. కానీ ఏం చేస్తాం నా దగ్గర డబ్బులేదు అనుకుంటూ.. బాధ పడేవారు చాలామంది ఉంటారు. అలాంటి వారి కోసమే ఈ కథ.. మీ దగ్గర ఉన్నవాటితో ప్రారంభించండి మీన మేషాలు లెక్కించకండి.. ప్ర‌య‌త్న‌మే తొలి మెట్టు.. కానీ విజ‌య‌మే ఆక‌రి మెట్టు కాదు

ఒక లక్ష్యం – అదో యుద్ధం

– RK

Read more RELATED
Recommended to you

Latest news