ఫ్లిప్‌కార్ట్‌ చేతికి ట్రావెల్‌ బుకింగ్‌ పోర్టల్‌ క్లియర్‌ట్రిప్‌

-

ప్రముఖ ఈ కామర్స్‌ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌ ట్రావెల్‌ బిజినెస్‌లోకి అడుగుపెట్టనుంది. ఆన్లైన్‌ ట్రావెల్‌ అగ్రిగేటర్‌ అయిన క్లియర్‌ట్రిప్‌లో వాటాలను కొనుగోలు చేసేందుకు చర్చలు జరుపుతోంది. వాల్‌మార్ట్‌ యాజమాన్యంలోని ఈ–కామర్స్‌ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌.. ట్రావెల్‌ అండ్‌ హోటల్‌ బుకింగ్‌ ప్లాట్‌ఫామ్‌ క్లియర్‌ట్రిప్‌లో కొంత వాటాను కొనుగోలు చేయనుంది. ఈ డీల్‌కు సంబంధించి రెండు కంపెనీల మధ్య జరుగుతున్న చర్చలు చివరి దశకు చేరుకున్నాయని ఎకనామిక్‌ టైమ్స్‌ నివేధిక స్పష్టం చేసింది. క్యాష్‌, ఈక్విటీల రూపంలో మొత్తం 40 మిలియన్‌ డాలర్ల మేర ఫ్లిప్‌కార్ట్‌ క్లియర్‌ ట్రిప్‌కు చెల్లించనుంది.15 ఏళ్ల క్రితం ముంబయిలో ప్రారంభమైన క్లియర్‌ ట్రిప్‌ ప్లాట్‌ఫామ్‌.. ట్రావెల్, హోటల్‌ బుకింగ్‌ సేవలను అందిస్తుంది. అయితే, గత ఏడాది నుంచి కరోనా కారణంగా హాస్పిటాలిటీ, ట్రావెల్‌ రంగం తీవ్ర ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొంటుండటంతో.. నష్టాల్లోకి జారుకుని తన వాటాలను విక్రయించాలని నిర్ణయం తీసుకుంది. తాజా నిర్ణయంపై క్లియర్‌ ట్రిప్‌కు చెందిన ఒక అధికారి బిజినెస్‌ డైలీతో మాట్లాడుతూ ‘ఫ్లిప్‌కార్ట్‌తో చర్చలు జరిగాయి. త్వరలోనే ఈ డీల్‌కు సంబంధించిన లావాదేవీలు ముగియనున్నాయి. త్వరలోనే మా పార్టనర్‌షిప్‌ నుంచి అధికారిక ప్రకటన రావచ్చు. కరోనా ప్రతికూల పరిస్థితుల కారణంగా నష్టాలను పూడ్చుకునేందుకు తమ వాటాని ఫ్లిప్‌కార్ట్‌కు అమ్మాలని నిర్ణయించింది‘ అని అన్నారు.

 

ఈ సంస్థకు ప్రస్తుతం ఇంటిగ్రేటెడ్‌ ట్రావెల్‌ అండ్‌ ఎక్స్‌పెన్స్‌ మేనేజ్‌మెంట్‌ సొల్యూషన్స్‌ , డీఏజీ వెంచర్స్, గండ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్రొవైడర్‌ కాంకర్‌ టెక్నాలజీస్‌ వంటి కంపెనీల ఇన్వెస్ట్‌మెంట్‌లు ఉన్నాయి. అయితే, క్లియర్‌ట్రిప్‌ ఇన్వెస్టర్ల మూలధనంలో సుమారు 70 మిలియన్‌ డాలర్లను సేకరించింది. చివరిసారిగా ఇది 2016లో నిధుల సమీకరణను చేపట్టింది. దీని ప్రస్తుత మార్కెట్‌ విలువ 300 మిలియన్‌ డాలర్లు. ‘‘కరోనాతో విమాన ప్రయాణాలు రద్దవ్వడంతో లాభాలను క్లియర్‌ట్రిప్‌ పొందలేకపోయింది. అయితే, ఫ్లిప్‌కార్ట్‌ ఇప్పుడు క్లియర్‌ట్రిప్‌లో ఇన్వెస్ట్‌మెంట్‌ పెట్టాలని నిర్ణయంతో భవిష్యత్తులో మరింతగా అభివృద్ధి చెందనుంది. దీనివల్ల ఆన్లైన్‌ ట్రావెల్‌ బుకింగ్‌ రంగంలో మొదటిస్థానమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నాం.’’అని క్లియర్‌ ట్రిప్‌ అధికారి పేర్కొన్నారు.

ఇటీవల ఫ్లిప్‌కార్ట్‌ తాజాగా తన లాజిస్టిక్స్‌, డేటా సెంటర్ల సామర్థ్యాన్ని మరింతగా పెంపొందించుకునేందుకు అదానీ గ్రూప్‌తో వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకుంది. దీని ద్వారా ప్రత్యక్షంగా 2,500 మందికి, పరోక్షంగా మరికొన్ని వేల మందికి ఉపాధి లభిస్తుందని ఫ్లిప్‌కార్ట్‌ తెలిపింది. కేవలం ట్రాన్స్‌పోర్టేషన్‌కు మాత్రమే కాకుండా డేటా సెంటర్‌ పరిధి కూడా పెంచుకోనుంది.

Read more RELATED
Recommended to you

Latest news