ఆధార్‌ నుంచి డీమ్యాట్‌ వరకూ డిసెంబర్‌లో చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి తెలుసా..?

-

ఈరోజు డిసెంబర్‌ ఒకటి.. ఈ సంవత్సరానికి ఆఖరి నెల. ఈ నెలలో చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. కేంద్రం తీసుకొచ్చిన పథకాల దగ్గర నుంచి ఆధార్‌ అప్‌డేట్‌, డీమ్యాట్‌ ఖాతాల నామినీ జోడించటం వరకు చాలా వాటికి డిసెంబరుతోనే గడువు ముగియనుంది. ప్రభుత్వ రంగ బ్యాంకులు అందిస్తున్న ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ పథకాల్లో మదుపు చేసేందుకు కూడా డిసెంబరే లాస్ట్‌. కాబట్టి నెలాఖరులో మీరు ఈ పనులు పూర్తి చేయకుంటే కొన్ని ప్రయోజనాలు కోల్పోయే ప్రమాదం ఉంది.

స్పెషల్‌ ఎఫ్‌డీలు :

ఐడీబీఐ అమృత్‌ మహోత్సవ్‌ పేరుతో 375, 444 రోజుల కాలవ్యవధితో ఎఫ్‌డీ డిపాజిట్ల గడువు డిసెంబరు 31కి ముగియనుంది. ప్రభుత్వరంగానికి చెందిన ఇండియన్‌ బ్యాంక్‌ ‘ఇండ్‌ సూపర్‌ 400’, ‘ఇండ్‌ సూపర్‌ 300 డేస్‌’ పేరుతో తీసుకొచ్చిన ప్రత్యేక ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ పథకాల గడువూ అదే రోజు ముగియనున్నాయి.

లాకర్‌ అగ్రిమెంట్‌ :

బ్యాంక్‌ లాకర్లకు సంబంధించి అగ్రిమెంట్‌ పునరుద్ధరణ గడువు కూడా డిసెంబర్‌తోనే ముగుస్తోంది. 2022 డిసెంబరు 31 కంటే ముందు లాకర్‌ అగ్రిమెంట్‌ను సమర్పించినవారు.. 2023 డిసెంబరు 31లోగా మరోసారి బ్యాంకులతో తమ లాకర్‌ అగ్రిమెంట్‌ను అప్‌డేట్‌ చేసుకోవాల్సి ఉంటుంది.

ఉచిత ఆధార్‌ అప్‌డేట్‌ :

పదేళ్లుగా ఆధార్‌ అప్‌డేట్‌ చేసుకోని వారి కోసం ఉచిత ఆధార్‌ అప్‌డేట్‌కు భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) అవకాశం కల్పించింది. ఈ ఏడాది డిసెంబరు 14 నాటికి ఆ గడువు ముగియనుంది. గడువు ముగిశాక ఆధార్‌ అప్‌డేట్‌ చేయాలంటే రూ.50 చెల్లించాల్సి ఉంటుంది.

ఈ ఖాతాలకు నామినీ జత చేశారా? :

మ్యూచువల్‌ ఫండ్‌, డీమ్యాట్‌ ఖాతాలకు నామినీ జత చేయడానికి సెబీ ఇచ్చిన గడువు కూడా డిసెంబరు 31 నాటికి ముగియనుంది. అలాగే, పాన్‌, నామినీ, బ్యాంక్‌ ఖాతా వివరాలు కూడా డిసెంబరు 31లోగా సమర్పించాల్సి ఉంటుంది. లేకపోతే మీ ఖాతాలు స్తంభించిపోయే ప్రమాదం ఉందని సెబీ ఇప్పటికే పేర్కొంది.

అమృత్‌ కలశ్‌ :

స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (SBI) తన పరిమితకాల స్పెషల్‌ డిపాజిట్‌ స్కీమ్‌ ‘అమృత్‌ కలశ్‌ డిపాజిట్‌’ (SBI Amrit Kalash) పథకం గడువు డిసెంబర్‌తో ముగియనుంది. ఈ స్కీమ్‌ కింద అందించే టర్మ్‌ డిపాజిట్లకు 7.10 శాతం కంటే ఎక్కువ వడ్డీని ఇస్తోంది. ఈ పథకం గడువు డిసెంబర్‌ 31తో ముగియనుంది.

యూపీఐ ఐడీలు డీయాక్టివేట్‌ :

ఏడాదికి పైగా వాడని యూపీఐ ఐడీలు, నంబర్లు డీయాక్టివేట్‌ చేయాలని నేషనల్‌ పేమెంట్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా గూగుల్‌ పే, పేటీఎం, ఫోన్‌ పే, బ్యాంకులకు సూచించింది. ఈ ఏడాది డిసెంబరు 31 నాటికి థర్డ్‌ పార్టీ యాప్‌ ప్రొవైడర్‌ (TPAP), పేమెంట్‌ సర్వీస్‌ ప్రొవైడర్లు (PSP) సదరు యూపీఐ ఐడీలకు డీయాక్టివేట్‌ చేయాలని సూచించింది.

ఎస్‌బీఐ హోమ్‌లోన్‌ ఆఫర్‌ :

గృహ రుణం తీసుకోవాలనుకొనే కస్టమర్ల కోసం స్టేట్‌ బ్యాంక్‌ ఆప్‌ ఇండియా ప్రత్యేక ఆఫర్‌ తీసుకొచ్చింది. హోమ్‌లోన్‌పై గరిష్ఠంగా 65 బేసిస్‌ పాయింట్ల వరకు రాయితీ కల్పించింది. ఈ ఆఫర్‌ డిసెంబర్‌ 31 నాటికి ముగియనుంది.

Read more RELATED
Recommended to you

Latest news