రూపాయి.. రూపాయి కూడగట్టుకొని ఓ సొంతిళ్లు కట్టుకుందామనే ఆలోచనలో ఉన్నవారికి ఇల్లు కట్టేందుకు అయ్యే ఖర్చులను ఓ సారి లెక్కలేసుకుంటే అమ్మో బాబాయ్ అనాల్సిందే. అంచనలకు అందని ఉక్కుధరలు, ఉహకందని సిమెంట్ ధరలు, ఇకపోతే ఇసుక దొరకడమే కష్టంగా మారింది. దాన్ని సైతం బ్లాక్ మార్కెట్‌లో కొనాల్సిన దుస్థితి నెలకొంది. నిర్మాణ సామగ్రి ధరలు పెరిగి ఆ రంగంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. కరోనాతో అతలాకుతలమైన నిర్మాణరంగం ఇప్పుడిప్పుడే కాస్త ఊరటనిస్తున్న తాజా పరిణామాలు మరింత కుంగదీస్తున్నాయి. చివరికొచ్చి ఈ భారమంతా వినియోగదారులపై పడటంతో వచ్చే ఏడాదిలో చూద్దాంలే అనే ధోరణి ఇల్లు కట్టాలనుకునే వారిలో వస్తోంది. నిర్మాణ సామగ్రి ధరలు పెరగడంతో నిర్మాణ ఖర్చు చదరపు అడుగు రూ.200 దాకా పెరిగిందని నిర్మాణదారులు పేర్కొంటున్నారు.
బ్లాక్‌లో ఇసుక..
గతంలో 18 టన్నుల ఇసుక రూ. 6 వేలకు వచ్చేది. కానీ.. ఇప్పుడు అదే 18 టన్నుల ఇసుక రూ. 17 వేలు ఇస్తామన్న దొరకడం లేదు. బేరమాడి, సముదాయించి తీసుకోవాల్సిప దుస్థితి నెలకొంది. పోనిలే అదే ధరకు కొందామంటే మనకు అసరమున్నప్పుడే దొరకదు. దానికి కూడా 2–3 రోజుల ముందే చెప్పాల్సిందే. ఉక్కు, సిమెంట్, ఇసుకతో పాటు వైరింగ్ సామగ్రి, సీపీవీసీ, సీసీవీ ధరలు సైతం 20% పెరిగినట్లు బిల్డర్లు చెబుతున్నారు.
సిమెంట్ ధరలు పైపైకి..
గత రెండు, మూడు నెలలుగా సిమెంట్ ధరలు పైపైకి పాకుతున్నాయి. పలు బ్రాండ్ సిమెంట్ ధరలు బస్తా రూ. 300 ఉండగా, ప్రస్తుతం రూ. 400లకు చేరింది. మాము బ్రాండ్లు అయితే రూ.250 – రూ.300లకు చేరాయి.
ఉక్కు..
గత పదిహేను ఏళ్లలో ఉక్కు ధరలు భారీగానే పెరిగాయి. విజయవాడ మార్కెట్లలో విశాఖ ఉత్పత్తి చేసే 8 ఎం.ఎం రాడ్‌ల ధర రూ. 70 వేలు పలుకుతుంది. అదే ఉక్కు ధర రెండు నెలల క్రితం రూ, 49,800 ఉండేది. నవంబర్ 15న 8 ఎం.ఎం చువ్వల ధరలు రూ. 45,800 ఉండగా రెండ్రోజుల క్రితం రూ.64,500లకు చేరింది. వీటి ధరలు పెరగడానికి అంతర్జాతీయ పరిణామాలే కారణమని మార్కెట్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.