స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లో మీకు ఖాతా ఉందా..? మీరు ఎస్‌బీఐ డెబిట్ కార్డుని వాడుతున్నారా..? అయితే ఈ ముఖ్యమైన విషయాలని మీరు తప్పక తెలుసుకోవాలి. వీటిని కనుక మీరు తెలుసుకుంటే ఎన్నో ప్రమాదాల్ని రాకుండా జాగ్రత్త పడొచ్చు. సర్వసాధారణంగా అందరికీ తెలిసినవే ఇవి. కానీ మరొక సారి చూస్తే జాగ్రత్తగా ఉండొచ్చు. బ్యాంక్ ఏటీఎం కార్డు ఉపయోగిస్తున్నప్పుడు జాగ్రత్తగా లేకపోతే అకౌంట్‌లో డబ్బులు పోగొట్టుకోవాల్సి ఉంటుంది. ఎస్‌బీఐ డెబిట్ కార్డు వాడే వారు కచ్చితంగా కొన్ని విషయాలు గుర్తించుకోవాలి. స్టేట్ బ్యాంక్ కూడా తన కస్టమర్లకు కొన్ని సేఫ్టీ టిప్స్ తెలియజేసింది. మరి అవి ఏమిటో తెలుసుకోవడానికి ఒక లుక్ వేసేయండి.
వివరాల్లోకి వెళితే… డెబిట్ కార్డు వాడే వాళ్ళు పిన్ నెంబర్ ఎవ్వరికీ చెప్పొద్దు. అలానే ఏటీఎం లేదా పీఓఎస్ మెషీన్లలో ఏటీఎం కార్డు వాడేటప్పుడు మీ పిన్ నెంబర్ ఎవ్వరికీ కనిపించకుండా కీబోర్డుకు అడ్డంగా చేతులు ఉంచి పిన్ టైప్ చెయ్యండి. మీరు మీ పిన్ నెంబర్ పెట్టుకునేటప్పుడు పుట్టిన తేదీ, ఫోన్ నెంబర్, అకౌంట్ నంబర్ వంటి వాటిని మీ పిన్ నెంబర్‌గా పెట్టుకోవద్దు. అలానే మీరు మీ ట్రాన్సాక్షన్ రశీదును తీసుకొని వెంటనే దాన్ని చించిపారేయండి. ఏటీఎం సెంటర్ లేదా బయట స్పై కెమెరాలు ఉన్నాయో లేదో చూడండి. అంతే కాదు ఏటీఎం కార్డు మీదనే పిన్ నెంబర్ రాసుకోవద్దు. చాల మందికి వీటి మీదే రాసుకునే అలవాటు ఉంది. ఎట్టి పరిస్థిలో అలా చెయ్యొద్దు.
కార్డు పిన్ నెంబర్ చెప్పాలంటూ వచ్చే ఎస్ఎంఎస్‌లు, ఈమెయిల్స్‌కు స్పందించొద్దు. ఏటీఎం, పీఓఎస్ మెషీన్లలో ట్యాంపర్ కీబోర్డు ఉందేమో నిశితంగా గమనించండి. మీ బ్యాంక్ అకౌంట్‌కు ఫోన్ నెంబర్ లింక్ చేసుకోండి. అప్పుడే ఏదైనా ట్రాన్సాక్షన్ జరిగితే వెంటనే ఆ విషయం మీకు తెలుస్తుంది. ఇలా ఈ విషయాల్లో జాగ్రత్త పడితే మోసాల బారిన పడకుండా ఉండొచ్చు.