డబ్బు పొదుపు చేసుకునేందుకు అందుబాటులో ఉన్న సురక్షితమైన స్కీమ్‌లలో పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ స్కీమ్ కూడా ఒకటి. ఇందులో డబ్బును పొదుపు చేస్తే సేఫ్టీ ఉంటుంది. అలాగే ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 80సి కింద ప్రతి ఏటా పన్ను మినహాయింపు పొందవచ్చు.
పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్)లో ప్రతి 3 నెలలకు ఒకసారి వడ్డీ రేట్లు మారుతుంటాయి. కేంద్ర ప్రభుత్వం ఆ రేట్లను ప్రకటిస్తుంది. ప్రస్తుతం ఈ స్కీమ్‌లో పొదుపు చేస్తే 7.1 శాతం వడ్డీని అందిస్తున్నారు. ఈ క్రమంలోనే పీపీఎఫ్ స్కీమ్ లో ప్రతి ఏడాది గరిష్టంగా రూ.1.50 లక్షల వరకు పొదుపు చేయవచ్చు.
పీపీఎఫ్ ఖాతా 15 ఏళ్లకు మెచూర్ అవుతుంది. ఆ తరువాత దీన్ని 5 ఏళ్ల వ్యవధితో అవసరం అయితే మళ్లీ పెంచుకోవచ్చు. ఇక పీపీఎఫ్‌లో నెలకు రూ.12వేల చొప్పున 15 ఏళ్ల పాటు పొదుపు చేస్తే చివరికి రూ.39,05,480.85 అవుతుంది. 15వ సంవత్సరం వరకు డబ్బును విత్‌డ్రా చేయకుండా, మళ్లీ ఖాతాను ఇంకో 15 ఏళ్ల వరకు 5 ఏళ్లకు ఒకసారి పొడిగించుకుంటూ వెళితే అప్పుడు రూ.1.09 కోట్లు వస్తాయి. 15వ ఏట తరువాత మళ్లీ 15 ఏళ్లు ఎలాంటి మొత్తం చెల్లించాల్సిన పనిలేదు. అయినప్పటికీ ప్రతి ఏడాది వడ్డీని చెల్లిస్తారు. దీంతో ఆ మొత్తాన్ని అందుకోవచ్చు.
ఇక 25 ఏళ్ల వయస్సు ఉన్న వ్యక్తి ఈ విధంగా డబ్బును పీపీఎఫ్‌లో పొదుపు చేస్తే అతనికి 55 ఏళ్లు వచ్చే వరకు ఆ మొత్తం లభిస్తుంది. దీంతో సులభంగా రిటైర్ అయి తదుపరి జీవితాన్ని ఆస్వాదించవచ్చు. ఆ డబ్బును పిల్లల భవిష్యత్తుకు కూడా ఉపయోగించవచ్చు. అయితే 15 ఏళ్ల తరువాత ఇంకో 15 ఏళ్లు కూడా డబ్బును పొదుపు చేస్తాం అనుకుంటే అప్పుడు చివరికి రూ.1.48 కోట్లు వస్తాయి.