రైళ్లలో ప్రయాణించాలంటే కొన్ని సార్లు మనకు అభద్రతా భావం ఉంటుంది. రైలు ప్రమాదాలు జరిగినప్పుడు మనకు అలా అనిపిస్తుంది. ప్రమాదం ఎలా జరిగినా సరే.. అలాంటి సమయంలో ఇతర ప్రయాణికులకు రైళ్లలో వెళ్లాలంటే భయంగానే ఉంటుంది. తమకు కూడా ఏదైనా ప్రమాదం ఎదురవుతుందేమోనని జంకుతారు. అయితే ఇకపై ఇలాంటి భద్రతా పరమైన సమస్యలకు రైల్వే శాఖ చెక్ పెట్టనుంది. ఎందుకంటే.. త్వరలో రైల్ సురక్ష పేరిట ఓ యాప్ ప్రయాణికులకు అందుబాటులోకి రానుంది.
రైలు ప్రయాణికులకు సహజంగానే ఎదురయ్యే భద్రతా సమస్యలను వేగంగా పరిష్కరించడం కోసం రైల్ సురక్ష పేరిట కొత్తగా ఓ మొబైల్ యాప్ ను రైల్వే శాఖ రూపొందించింది. ఈ యాప్ ఈ నెల చివర్లో అందుబాటులోకి వస్తుంది. అయితే ముందుగా సెంట్రల్ రైల్వే పరిధిలోని దూరప్రాంత, లోకల్ రైలు ప్రయాణికులకు ఈ యాప్ అందుబాటులోకి వస్తుంది.
ప్రయాణికులు ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని తమకు ఏదైనా సమస్య ఉంటే యాప్‌లో తెలపాలి. దీంతో ఆ సమాచారం ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ లో ఉన్న కంట్రోల్ రూం(182)కు చేరుతుంది. అక్కడి సిబ్బంది వెంటనే స్పందించి ఫిర్యాదు చేసిన ప్రయాణికుడి ఫోన్ ఎక్కడ ఉందో గుర్తిస్తారు. అనంతరం దగ్గరలోని రైల్వే రక్షక దళం (ఆర్‌పీఎఫ్)లేదా గవర్నమెంట్ రైల్వే పోలీస్ (జీఆర్‌పీ)లను అప్రమత్తం చేస్తారు. దాంతో అధికారులు ఫిర్యాదు చేసిన ప్రయాణికుడి దగ్గరకి వెళ్లి సమస్యను పరిష్కరిస్తారు. ఇలా రైళ్లలో ప్రయాణించే ప్రయాణికులు తమకు భద్రతా పరంగా ఎదురయ్యే సమస్యలను పరిష్కరించుకోవచ్చు. అయితే దేశ వ్యాప్తంగా ఈ యాప్ రైలు ప్రయాణికులకు అందుబాటులోకి ఎప్పుడు వచ్చేది అధికారులు వివరాలను వెల్లడించలేదు.