మహిళా సమ్మాన్‌ సేవింగ్స్‌: ఎందుకు ఈ స్కీమ్‌కు ఇంత డిమాండ్‌..?

-

కేంద్ర ప్రభుత్వం మహిళల కోసం వివిధ పథకాలను ప్రవేశపెట్టింది. ఇందులో పొదుపు చేస్తే.. మహిళలు ఆర్థిక భరోసాతో పాటు, పొదుపు కూడా అలవాటు అవుతుంది. కేంద్ర తీసుకొచ్చిన పథకాల్లో ఇప్పుడు బాగా ట్రెండ్‌ అవుతున్న స్కీమ్‌.. మహిళా సమ్మాన్‌ సేవింగ్స్‌ సర్టిఫికెట్. ప్రస్తుతం పోస్టాఫీసులు సహా పలు బ్యాంకుల్లో ఈ అకౌంట్ ఓపెన్ చేయొచ్చు. ఈరోజు మనం ఈ పథకం పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందామా.

ఈ పథకంలో భాగంగా రూ. 2 లక్షల వరకు ఒకేసారి డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. మెచ్యూరిటీ పీరియడ్ 2 సంవత్సరాలు. అంటే రెండేళ్ల తర్వాత పూర్తి డబ్బులకు వడ్డీ కలిపి మీ చేతికి వస్తుంది. ఇందులో స్థిరమైన వడ్డీ రేటు 7.5 శాతంగా ఉంది. ఇందులో మహిళలు మాత్రమే చేరేందుకు అర్హులు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌ను పురస్కరించుకొని ఈ స్కీం లాంఛ్ చేయగా.. మహిళలు పెద్ద మొత్తంలో ఇందులో చేరుతున్నారు. ఇప్పటివరకు ఏకంగా 14.83 లక్షల అకౌంట్లు ఓపెన్ అయ్యాయని.. వీటిల్లో ఏకంగా రూ.8630 కోట్ల మేర జమ అయ్యాయి. ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి సోమవారం రోజు.. పార్లమెంటుకు తెలిపారు.

ఈ స్కీంలో భాగంగా కనీసం రూ.1000 డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. గరిష్టంగా రూ. 2 లక్షలు డిపాజిట్ చేయాలి. ఏ వయసులో ఉన్న బాలిక, మహిళ అయినా ఇందులో చేరేందుకు అర్హులే. ఇక ఒక అకౌంట్ తెరిచిన 3 నెలల తర్వాత మరొక అకౌంట్ కూడా తెరవొచ్చు. ఇందులో వడ్డీ అనేది ప్రతి 3 నెలలకు ఓసారి యాడ్ అవుతుంటుంది. అదేవిధంగా పాక్షిక నగదు ఉపసంహరణ సహా.. ముందస్తు నగదు ఉపసంహరణ సదుపాయాలు కూడా ఉన్నాయి.

ఇది తొలుత పోస్టాఫీస్‌ల్లోనే అందుబాటులో ఉండేది.. తర్వాత అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకుల్లోనూ అందుబాటులోకి వచ్చింది. ఇంకా నాలుగు ప్రైవేట్ బ్యాంకుల్లోనూ ఉంది. ఈ స్కీం 2025 మార్చి 31 వరకు అందుబాటులో ఉంటుంది.

ఈ స్కీంలో భాగంగా ఒకసారి రూ. 2 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే దీనిపై 7.5 శాతం వడ్డీ ప్రకారం ఏడాదికి రూ.15,427 లాభం వస్తుంది. అలాగే రెండేళ్లకు రూ.32,044 వస్తుంది. అంటే రూ. 2 లక్షల ఇన్వెస్ట్‌మెంట్‌పై రూ. 32 వేలకుపైగా లాభం వస్తుంది. అయితే మీ దగ్గర 2లక్షలు ఉంటే.. వాటిని బయట రెండు రూపాయల వడ్డీకు ఇచ్చుకుంటే ఇంతకు మించి డబుల్‌ వస్తుంది. కాకపోతే.. అప్పు ఇవ్వడం వల్ల మళ్లీ వాళ్లు తిరిగి ఇస్తారో లేదో అన్న టెన్షన్‌ ఉంటుంది. అది పక్కనపెడితే.. అందులో ఎలాంటి రిస్క్‌ ఉండదు.

Read more RELATED
Recommended to you

Latest news