న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రైవేటీకరణ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. వచ్చే ఆర్థిక సంవత్సరానికి వ్యయ అంచనాలను చేరుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీనిలో భాగంగా నాలుగు ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రైవేటీకరణ చేయనుంది. ఇందులో ‘బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్‌లను ఎంపిక చేసినట్లు సమాచారం. ఈ సమాచారాన్ని ఆయా బ్యాంకుల్లో పని చేస్తున్న ఉన్నతాధికారులు సమాచారం అందించినట్లు వార్తా సంస్థ రాయిటర్స్ ప్రకటించింది.
2021-22 ఆర్థిక సంవత్సరంలో మొదటగా రెండు బ్యాంకులను ప్రైవేటీకరణ చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే బ్యాంకుల ప్రైవేటీకరణ అనేది వేలాది మంది ఉద్యోగులతో ముడిపడిన వ్యవహారం. దీంతో మొదట్లో చిన్న, మధ్య స్థాయి ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రైవేటీకరించి.. దానిపై వచ్చే స్పందన ఆధారంగా వచ్చే కొన్నేళ్లలో పెద్ద బ్యాంకులను ప్రైవేటు పరం చేయనున్నట్లు కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది.
దేశీయ అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ)లో మెజారిటీ వాటా ప్రభుత్వం వద్దే ఉన్నట్లు.. గ్రామీణ ప్రాంతాల్లో రుణ విస్తరణకు ఈ బ్యాంకు కీలక పాత్ర వహిస్తోందని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. దీనిపై వివరణ ఇచ్చేందుకు కేంద్ర ఆర్థిక శాఖ ప్రతినిధి నిరాకరించడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రైవేటీకరణ చేయడంతో ఉద్యోగ సంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోంది. బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 50 వేల మంది ఉద్యోగులు, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 33 వేల మంది ఉద్యోగులు, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్‌లో 26 వేల మంది, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో 13 వేల మంది ఉద్యోగులు ఉన్నారు. బ్యాంకుల ప్రైవేటీకరణ, బీమా, ఇతర ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహణ వంటి నిర్ణయాలపై ఉద్యోగ సంఘాలు సోమవారం నుంచి రెండు రోజుల పాటు సమ్మె నిర్వహిస్తున్నారు.