దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకులు, కొన్ని ప్రైవేట్ పెద్ద బ్యాంకులు తమ ఖాతాదారుల నుంచి సేవల పేరిట భారీగా డబ్బులు వసూళ్లు చేస్తున్నారు. ఈ విషయాన్ని ఐఐటీ బొంబాయికి చెందిన అధికారులు వెల్లడించారు. బ్యాంకుల సేవల పేరిట ఖాతాదారుల నుంచి ఎంత మొత్తంలో డబ్బులు వసూలు చేస్తుందనే విషయంపై పరిశోధన జరిపారు. ఈ పరిశోధన అధ్యాయనంలో విస్తుపోయే విషయాలను నివేదించారు. పొదుపు ఖాతా, జన్‌ధన్ ఖాతాలను తెరిపించుకుని పేదల బ్యాంకుల ఖాతాల ద్వారా సర్వీస్ ఛార్జీలను వసూలు చేస్తున్నాయని, ఇలా ఆ బ్యాంకులు కోట్లలో డబ్బులు వసూలు చేస్తున్నాయని ఐఐటీ బొంబాయి వెల్లడించింది.
దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ).. బేసిక్ సేవింగ్స్ బ్యాంకు డిపాజిట్ అకౌంట్ నుంచి.. ఖాతాదారుడు నాలుగు సార్లు ట్రాన్సక్షన్స్ నిర్వహించిన తర్వాత.. ఈ బ్యాంకు ప్రతి విత్‌డ్రాపై రూ.17.70 ఛార్జీని వసూలు చేస్తోంది. అలా దేశంలోని మొత్తం 128 కోట్ల బీఎస్‌బీడీ ఖాతాదారుల నుంచి సేవల పేరిట మొత్తంగా రూ.308 కోట్లు వసూలు చేసిందన్నారు. 6 ఏళ్లలో ఈ బ్యాంకు ఇన్నీ కోట్లను రికవరీ చేసిందని ఐఐటీ బొంబాయి తెలిపింది. అలాగే రెండవ అతిపెద్ద ప్రభుత్వ ఆధీన బ్యాంక్ పంజాబ్ నేషనల్ బ్యాంకు కూడా సేవల పేరిట పేదల నుంచి డబ్బులు వసూలు చేస్తోంది. దేశవ్యాప్తంగా ఈ బ్యాంకులో బీఎస్‌బీడీ ఖాతాదారుల సంఖ్య 3.9 కోట్లు ఉండగా.. 6 ఏళ్లలో సేవల పేరిట రూ.9.9 కోట్లు సమీకరించింది. అయితే ఈ బ్యాంకులు ఖాతాదారుల నుంచి ఇంత మొత్తంలో డబ్బులను డిడక్ట్ చేస్తున్న విషయం కస్టమర్లకు తెలియకపోవడం గమనార్హం.
ఆర్‌బీఐ నిబంధనల ఉల్లంఘన..
ఐఐటీ బొంబాయి నివేదిక ప్రకారం.. ఈ అతి పెద్ద బ్యాంకులు ఆర్‌బీఐ నిబంధనలను కూడా ఉల్లంఘిస్తున్నాయని పేర్కొంది. ఇందులో ఎస్‌బీఐ మొదటి వరుసలో ఉందన్నారు. డివిజల్ లావాదేవీలలో నాలుగు ఉపసంహరణల తర్వాత ఈ బ్యాంకు కస్టమర్ల నుంచి రూ .1770 వసూలు చేస్తోంది. 6 ఏళ్లలో బ్యాంక్ ఫైనాన్షియల్ ఇయర్ ముగిసిన నాటికి ఎస్‌బీఐ వసూలు చేసిన డబ్బుల వివరాలు ఇలా ఉన్నాయి. 2015లో రూ.4.7 కోట్లు, 2016లో రూ.12.4 కోట్లు, 2017లో రూ.26.3 కోట్లు, 2018లో రూ.34.7 కోట్లు, 2019లో రూ.72 కోట్లు, 2020లో రూ.158 కోట్లు వసూలు చేసింది. అయితే ఆర్‌బీఐ నిబంధనల ప్రకారం.. బేసిక్స్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ (బీఎస్‌బీడీ) ఖాతా.. పొదుపు ఖాతాగా కొనసాగేంతవరకు ఏ బ్యాంకులు ఎలాంటి ఛార్జీలు వసూలు చేయరాదు. కానీ ఈ బ్యాంకులు మాత్రం డబ్బులను సేవల పేరిట వసూలు చేస్తున్నాయి.