లేదు లేదనుకున్న కోడి.. ఇల్లెక్కి కూసినట్టుగా ఉంది.. టీడీపీ నాయకురాలు, తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు, మాజీ ఎమ్మె ల్యే వంగలపూడి అనిత వ్యవహారం అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. విశాఖ ఘటన విషయంలో ప్రభుత్వాన్ని ఎలా విమ ర్శించాలా? అని పార్టీ అదినేత చంద్రబాబు సహా పలువురు నాయకులు సబ్జెక్ట్ వెతుక్కుంటున్నారు. అయినా వారికి ఎక్కడా లూప్ హోల్స్ కనిపించలేదు. దీంతోఏదో ఒకటి మాట్లాడేయాలి కాబట్టి మాట్లాడేస్తున్నారు. ఈ క్రమంలోనే అనిత కూడా తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. అయితే, దీనిలో సబ్జెక్ట్.. పస .. అంటూ ఏమీ వెతుక్కోడానికి ఉండవు. ఆమె విమర్శించింది.. అంటే.. విమర్శించింది.. అంతే(ఉద్యోగాన్ని కాపాడుకొనేందుకు ఏదో ఒకటి చేశాడని అంటారు కదా! అలాగన్నమాట!!)
ముందుగా `మందు` విషయంపై అనితమ్మ గళం విప్పారు. అయితే, అనితమ్మకు అంతే రేంజ్లో సోషల్ మీడియాలో సటైర్లు పేలాయి. అత్యధిక ధరలు పెంచాం కాబట్టి మద్యం సేవించే వారి సంఖ్య తగ్గుతుందని జగన్ చెప్పడం ఆయన అవగాహన లేమికి, అజ్ఞానానికి, మూర్ఖత్వానికి నిదర్శనమని అనిత విమర్శించారు(అయితే, ధరలు పెంచడానికి ఏమైనా క్వాలిఫికేషన్స్ ఉండాలా?- ఓ వ్యక్తి సందేహం). ముఖ్యమంత్రి ఆలోచనకు తన సానుభూతి తెలిపారు(దేనికి సానుభూతి ఎందుకు? ఓ సందేహాస్పదుడి ప్రశ్న). అంతేకాదు, మద్య పాన నిషేదం అనేది ఒక కొంగ జపం చేస్తూ మహిళలను మోసం చేస్తున్నారని(ఏదీ.. అప్పట్లో పసుపు-కుంకం ఇచ్చినట్టా?- ఇవి అందని ఓ మహిళా మణి ప్రశ్న) మండిపడ్డారు.
మద్యం మానిపించడానికి ఒక్క రీఎడిక్షన్ సెంటర్, కౌన్సింగ్ సెంటర్, టీం, యంత్రాంగం ఏమైనా పెట్టారా? అని ప్రశ్నించారు(వాస్తవానికి బాబు పాలనలోనే లేవు. మరి ఇప్పుడెలా వస్తాయంటే.. అనితమ్మ ఏం చెప్తారో). మద్యం మహమ్మారి వలన ఆరెంజ్ జోన్ లో ఉన్న వైజాగ్ రెడ్ జోన్ లోకి వెళ్లిందని అనిత ఆక్షేపించారు(అరే.. సాంబ రాసుకోవాల్సిందే- సోషల్ మీడియా సటైర్లు) 16 నెలలు జైల్లో ఉన్న నేపథ్యంలో ఇలాంటి ఆలోచనలు పుట్టుకొస్తాయని జగన్ను ఉద్దేశించి అనితమ్మ విమర్శించారు(మరి బెల్టు షాపులు పెరిగినప్పుడు బాబు గారిని ఏమనాలి?- ఓ వైసీపీ నేత ప్రతివిమర్శ). 36 కంపెనీల ద్వారా 1300 మద్యం బ్రాండులను తీసుకువచ్చారని, మద్య నిషేదం చేస్తానని హామీనిచ్చిన పెద్ద మనుషులు అన్ని బ్రాండులను తీసుకురావాల్సిన అవసరం ఏముందని అనిత ప్రశ్నించారు(మేక్ ఇన్ ఇండియాను మనోళ్లే కదమ్మా వేనోళ్ల కొనియాడారు- ఓ పుల్లాయ్ వాదన).
నాటు సారా తయారు చేయడంలో జగన్ వాలెంటరీలకు తెలిసినంతగా ఎవరికి తెలియదని అనిత ఎద్దేవా చేశారు(అయితే, సారాపై ఉద్యమం చేస్తారన్నమాట. ఇంకెందుకు రెడీ- ఓ ఔత్సాహిక వైసీపీ కార్యకర్త ఎద్దేవా). 24 వేల బెల్టు షాపుల కేసులు జగన్ ప్రభుత్వంలోనే నమోదయ్యాయని, కర్నూలులో బెల్టు షాపులకు ఎక్సైజ్ పోలీసుల చేత మద్యం సరఫరా చేయించారని అనిత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక, విశాఖ `విషం`పై అనిత ఏమన్నారంటే.. జగన్కు డీల్ చేయడం రాదు. అదే ఈ సమయంలో చంద్రబాబుగారు అధికారంలో ఉండి ఉంటే.. పరిస్థితి వేరేగా ఉండేది. ఎల్జీ కంపెనీ దిగివచ్చి.. మోకరిల్లేది అన్నారు.(మరి గోదావరిలో 33 మంది చనిపోయిన ప్పుడు గోదావరి దిగిరాలేదే- ఓ సందేహ రాయుడి సందేహం)
జగన్ ప్రభుత్వం విఫలమైంది.. అని అనిత ఎద్దేవా చేశారు(ఈ విషయం ఏడాది కిందటే తేల్చారు కదమ్మా..- ఓ ఓటరు ఎత్తిపొడుపు) మంత్రులు నిద్రపోతున్నారు. విశాఖలో ఇంత ఘటన జరిగితే.. జగన్ సమీక్ష కూడా చేయలేదు. కనీసం మంత్రులతోనూ చర్చించలేదు అని విమర్శలు గుప్పించారు. మొత్తానికి అనిత మాటల మంటలు.. ప్రజల సటైర్ల విరుపులు కడుపుబ్బ నవ్వించాయని అంటున్నారు పరిశీలకులు.