రాజకీయాల్లోకి ఎప్పుడు అరంగేట్రం చేశారనేది కాదు.. ఎలా దూసుకుపోతున్నారనేదే కీలకం. ఈ విషయంలో సీనియర్లను పక్క న పెట్టిన జూనియర్లు మన కళ్లముందే కనిపిస్తున్నారు. వారిలో ఎంపీలైనా ఉండొచ్చు.. ఎమ్మెల్యేలైనా ఉండొచ్చు.. వారి లక్ష్యం రాజకీయంగా తమ పీఠాలను శాశ్వతం చేసుకోవడమే. ఇదే పంథాను వైసీపీ అధినేత, సీఎం జగన్ అనుసరిస్తున్నారనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రస్తుతం జగన్ పాలనకు ఏడాది పూర్తయింది. ఆయన పాలన అంతా కూడా చాలా భిన్నంగా ఉందనేది టాక్. ఏ వర్గానికీ ఆయన దూరం కావడం లేదు. అలాగని ఏ వర్గాన్ని అతిగా నెత్తిన ఎక్కించుకోవడం లేదు. అనేక పథకాలు, సంక్షేమ కార్యక్రమాలను నెత్తిన ఎత్తుకున్నారు.
మేనిఫెస్టోను తన మార్గదర్శి చేసుకున్నారు. కొన్ని విషయాల్లో కఠినంగా ఉంటూనే.. చాలా విషయాల్లో ఉదారంగా వ్యవహరిస్తు న్నారు. అయితే, కఠిన విషయాల్లో తాను అమలు చేస్తున్న విధానాలకన్నా.. ఉదారంగా వ్యవహరిస్తున్న విధానాలను ప్రజల్లో కి తీసుకు వెళ్లడంలోనూ తనదైన శైలిలో వ్యవహరిస్తున్నారు. ఎక్కడా విస్తృత ప్రచారం కోరుకోవడం లేదు. అలాగని మౌనంగా నూ ఉండడం లేదు. ప్రచారం చేసుకుంటూనే.. పైకి వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. దీర్ఘకాలంపాటు అధికారంలో కొనసాగడం అనే లక్ష్యంతో నిర్ణయాలు తీసుకుంటూ, పథకాలు రూపొందిస్తున్నారు. ఈ క్రమంలో ప్రతిపక్షాల నుంచి వస్తున్న విమర్శలు, న్యాయస్థానాల అభ్యంతరాలను కూడా ఆయన ఖాతరు చేయడంలేదు.
ఉదాహరణకు ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టే విషయమే తీసుకుందాం. మాతృభాషకు ప్రాధాన్యం లేకపో వడం ఏమిటి అని ఆక్షేపించిన విపక్షాలపై ‘‘నీ పిల్లలు ఎక్కడ చదువుతున్నారు? బడుగు, బలహీనవర్గాల పిల్లలకు ఇంగ్లిష్ భాషపై పట్టు ఉండకూడదా?’’ అని ఎదురుదాడి చేయడం ద్వారా వారంతా స్వరాన్ని సవరించుకోవలసిన పరిస్థితి కల్పించారు. అంతేకాదు, ప్రతిపక్షాలను ఆత్మరక్షణలోకి నెట్టడంతోపాటు బడుగు, బలహీనవర్గాల శ్రేయోభిలాషిగా పేరుకు పేరు కూడా సంపాదించుకున్నారు. ఆంగ్ల మాధ్యమానికి సంబంధించిన జీవోను హైకోర్టు కొట్టివేయడంతో విద్యార్థుల తల్లిదండ్రుల అభిప్రాయా లను సేకరించడం ద్వారాదీనిపై పట్టు పెంచుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు. మొత్తంగా ఈ పరిణామాలు గమనిస్తే.. జగన్ తొలి ఏడాదిలో ఆయన వేసుకున్న బాట ఆయనకు మంచి గుర్తింపునే తెచ్చిందనడంలో సందేహం లేదు. జగన్ 1.0 సక్సెస్ అయిందనే చెప్పాలి.