”2 ఏళ్ల కిందట నాన్న హార్ట్ ఎటాక్‌తో చనిపోయారు. అప్పటి నుంచి మాకు కష్టాలు మొదలయ్యాయి. అమ్మ, తమ్ముడి భారం నాపై పడింది. ఆర్థిక సమస్యలు చుట్టు ముట్టాయి. చేతిలో చిల్లిగవ్వ లేదు. వెంటనే ఉద్యోగం వెతకడం ప్రారంభించా. కానీ పుట్టుకతోనే నాకు చెవులు వినిపించవు. మాట్లాడలేను. అందువల్ల నేనెక్కడికి వెళ్లినా నాకు ఎవరూ ఉద్యోగం ఇవ్వలేదు. కానీ అనుకోకుండా అదృష్టం నన్ను వరించింది. అమెజాన్ కంపెనీలో స్టేషన్ సపోర్ట్ అసోసియేట్‌గా ఉద్యోగం ప్రారంభించా.
జాబ్‌లో చేరినప్పుడు నాకు విపరీతమైన భయం వేసింది. నాకున్న లోపాల వల్ల నన్ను ఎవరైనా రిజెక్ట్ చేస్తారేమోనని, నేను పని చేయలేమోనని.. భయపడ్డా. కానీ కంపెనీలో నా తోటి ఉద్యోగులు నాకు హెల్ప్ చేశారు. నెమ్మదిగా జాబ్‌లో అడ్జస్ట్ అయ్యా. లైఫ్ సాఫీగా సాగిపోతుంది అనుకున్నా. కానీ సడెన్‌గా కరోనా మహమ్మారి అందరి జీవితాల్లోకి వచ్చింది. నా ఉద్యోగం పోతుందేమోనని మరోసారి భయపడ్డా. కానీ అలా జరగలేదు. నేను పనిచేసేది అత్యవసర సేవల విభాగం కనుక.. నన్ను ఉద్యోగం నుంచి తీసేయలేదు. కానీ కరోనా లాక్డౌన్లో రోజూ జాబ్‌కు వెళ్లాల్సి వచ్చింది. కంపెనీ బస్ పెట్టినా.. నాకు కరోనా సోకుతుందేమోనని అమ్మ భయపడేది. రోజుకు నాలుగైదు సార్లు ఫోన్ చేసేది. నేను బాగానే ఉన్నానని అమ్మకు సర్దిచెప్పేదాన్ని.
ఇప్పుడు లాక్‌డౌన్‌కు రిలాక్సేషన్స్ ఇచ్చారు. కొంత భయం తగ్గింది. అయినప్పటికీ అమ్మకు మాత్రం నా గురించి ఆందోళన తగ్గలేదు. అయినా సరే.. రోజూ నేను అమ్మను కన్విన్స్ చేస్తున్నా. ఎందుకంటే.. నేను జాబ్ చేయకపోతే.. మా కుటుంబం పరిస్థితి ఎలా ఉంటుందో నాకు తెలుసు. అందువల్ల కరోనా మాకు నష్టం కలిగించకూడదని అనుకున్నా.. నిత్యం ఉద్యోగానికి యథావిధిగానే వెళ్తున్నా. ప్రస్తుతం అమ్మకు కొంత వరకు ఆందోళన తగ్గింది. అవును.. కష్టం వచ్చిందని ఎవరూ ఆందోళన చెందవద్దు. ముందుకు సాగాలి. ప్రపంచం ఎవరి కోసం ఆగదు. కనుక మనం కూడా దాంతో నిత్యం పరుగెత్తాల్సిందే..!”