సహజంగానే మనిషి సెంటిమెంట్ జీవి! ఇక, రాజకీయాలు, సినిమాల్లోనూ ఉండేవారికైతే.. ఈ సెంటిమెంట్లు మరీ ఎక్కువగా ఉంటాయి. కొందరికి డేట్ సెంటిమెంట్.. మరికొందరికి డేస్ సెంటిమెంట్. ఇలా ఒక్కొక్కరికి ఒక్కో సెంటిమెంట్. అసలు సెంటిమెంట్ లేని వారంటూ.. ఎవరూ ఉండరని అంటారు చలం! ఈయన నవలల్లో కనిపించే సెంటిమెంట్ లేడీ!! సరే.. ఇప్పుడు విషయంలోకి వస్తే.. ఏపీని పాలిస్తున్న జగన్కు కూడా కొన్ని సెంటిమెంట్లు ఉన్నాయట! తాజాగా వైసీపీ నాయకులు ప్రభుత్వం ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ విషయాన్ని వెల్లడించారు. జగన్ సెంటిమెంట్ చూస్తే.. చాలా చిత్రంగా అనిపించింది.
జగన్ సెంటిమెంట్ గురువారంట! వైసీపీ నాయకులే చెబుతున్న విషయం ఇది. ఆయన విజయాలకు గురువారమే చిహ్నమని చెబుతున్నారు. 2019 ఎన్నికల్లో భారీ ఎత్తున 151 అసెంబ్లీ, 22 పార్లమెంటు స్థానాలను కైవసం చేసుకున్న జగన్ గెలుపు గుర్రం ఎక్కిన రోజు గురువారమేట!గత ఏడాది ఏప్రిల్ 11న రాష్ట్రంలో ఎన్నికలు జరిగాయి. అది కూడా గురువారమే. అంతేకాదు, ఎన్నికల ఫలితాలు వచ్చిన మే 23 కూడా గురువారమేట. ఈ ఫలితాల్లో నే జగన్ విజయ దుందుభి మోగించారు.
ఇక, సీఎంగా జగన్ ప్రమాణ స్వీకారం చేసిన రోజు కూడా గురువారమేనని పెద్ద ఎత్తున ప్రచారంలో ఉంది.గత ఏడాది మే 30న జగన్ ప్రమాణ స్వీకారం చేశారు. ఆ రోజు గురువారమే. మొత్తంగా జగన్ విజయాలకు, వైసీపీ విజయాలకు కూడా గురువారం కలిసి వచ్చిందని, పార్టీకి , తమ నాయకుడుకి కూడా గురువారం పెద్ద ఎత్తున విజయాన్ని అందించిందని అంటున్నారు వైసీపీ నాయకులు కార్యకర్తలు. ఇదే విషయాన్ని సోషల్ మీడియాలోను, చాటింగుల్లోనూ చెప్పుకోవడం గమనార్హం. మరి జగన్ ఈ విషయం గుర్తించి ఎలా ఫీలయ్యారో?! మొత్తానికి జగన్ సెంటిమెంటు ఇదన్నమాట!