కరోనా మహమ్మారి నేపథ్యంలో తిరుమల శ్రీవారి ఆలయాన్ని గత 80 రోజుల నుంచి మూసివేసిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ స్వామి వారికి నిత్యం జరగాల్సిన పూజలు, అభిషేకాలను పండితులు యథావిధిగా నిర్వహిస్తున్నారు. అయితే లాక్‌డౌన్ 5.0లో భాగంగా జూన్ 8 నుంచి ఆధ్యాత్మిక ప్రదేశాలు, ప్రార్థనా మందిరాలను ఓపెన్ చేసుకునేందుకు కేంద్రం అనుమతులు ఇచ్చింది. దీంతో జూన్ 8 నుంచి తిరుమల శ్రీవారి ఆలయాన్ని భక్తుల కోసం మళ్లీ తెరవనున్నట్లు తెలిసింది.
అయితే శ్రీవారి ఆలయంలోకి భక్తులను మళ్లీ అనుమతించాలంటే.. అందుకు ఆ రాష్ట్ర దేవాదాయ శాఖ నుంచి అనుమతి రావాల్సి ఉంటుంది. అది రాగానే దర్శనాలను మళ్లీ ప్రారంభించాలని ఆలయ ధర్మక్తల మండలి, ఉన్నతాధికారులు ప్రణాళికలను రచిస్తున్నారు. కరోనా జాగ్రత్తలు పాటిస్తూ.. భక్తుడికి, భక్తుడికి మధ్య కనీసం 1 మీటర్ భౌతిక దూరం ఉండేలా.. నిత్యం పరిమిత సంఖ్యలో భక్తులను శ్రీవారి దర్శనానికి అనుమతించనున్నారని తెలిసింది. ఇక ఈ విషయంపై టీటీడీ త్వరలో ప్రకటన చేయనున్నట్లు సమాచారం.
అయితే శ్రీవారి దర్శనానికి భక్తులను అనుమతిస్తే.. భక్తులు కొండపై విశ్రాంతి తీసుకునేందుకు అద్దె గదులను కూడా ఇవ్వాల్సి ఉంటుంది. మరి అందుకు టీటీడీ అనుమతి ఇస్తుందో లేదో చూడాలి.