రాష్ట్ర బీజేపీలో చిల్లర రాజకీయాలు నడుస్తున్నాయా? ఇంకేముంది.. రేపో మాపో.. పదవి పోతుందనే బెంగతో ఓ కీలక నేత.. చిల్ల ర కోసం తాపత్రయ పడుతున్నారా? అంటే..తాజా పరిణామాలను గమనిస్తున్న రాష్ట్రంలోని బీజేపీలో ఉన్న ఓ వర్గం ఔననే గుసగుసలాడుతోంది. పేరు వెల్లడించడానికి ఇష్టపడని మాజీ మంత్రి సహా.. ఎమ్మెల్సీ ఒకరు ఘాటుగానే విమర్శలు చేస్తున్నారు. తాజాగా.. రాష్ట్రంలో జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న బీజేపీ కీలక నేత ఒకరు.. ఇసుక కుంభకోణం జరిగిందని, తాను దీనిపై యుద్ధం ప్రకటించానని పదే పదే చెప్పుకొన్నారు.
అదేసమయంలో రాష్ట్రంలోని ఇసుక రీచ్‌లలో కూడా తాను తిరుగుతానని, క్షేత్రస్థాయిలో ఏం జరుగుతోందో చూస్తానని వెల్లడించా రు. అయితే, వాస్తవానికి ఆయన వ్యాఖ్యలకు, బెదిరింపులకుఎవరూ భయపడే పరిస్తితి లేదు. ప్రభుత్వం కూడా సదరు రాష్ట్ర స్థాయి నేతను పట్టించుకునే అవకాశం కూడా లేదు. కానీ, తనను తానే ఇమేజ్ ఉందని ప్రకటించుకునే సదరు నాయకుడు.. తాజాగా ఓ జిల్లాలోని ఇసుక రీచ్‌లలో పర్యటించారు. అక్కడి కొన్ని ట్రాక్టర్ల యజమానులతోనూ స్వయంగా మాట్లాడారు. ఈ క్రమంలోనే తనను ఆఫీస్ కు వచ్చి కలవాలని ఆయన మౌఖిక ఆదేశాలు ఇచ్చారు.
అయితే, ఈ విషయం ఆనోటా.. ఈ నోటీ పడి లీకైపోయింది. దీంతో పార్టీలోని సదరు నేతను వ్యతిరేకించే కొందరు నేతలు.. నిప్పులు చెరిగారు. చిల్లర కోసం రాజకీయాలు చేస్తున్నారంటూ.. మండిపడ్డారు. ఏడాది కాలంగా రాష్ట్రంలో ఇసుక సమస్య ఉందని, కానీ, ఈయనకు ఇప్పుడే గుర్తుకు వచ్చిందా? అది కూడా పదవీ కాలం ముగిసిపోతున్న సమయంలోనే ఈయన ఉలిక్కిపడి నిద్రలేరా? అని విమర్శలు సంధించారు. ఇసుకలో కాసుల వేట కోసం ఆయన తహతహ లాడిపోతున్నారని కూడా అన్నారు. మొత్తంగా సదరు నాయకుడి వ్యవహారం.. అధికార పక్షంలో ఎలాంటి అలజడీ రేపకపోయినా.. స్వపక్షంలోనే విమర్శల జడి పెంచుతుండడం చిత్రంగా ఉందని అంటున్నారు పరిశీలకులు.