Revanth Reddy’s cabinet team going to Delhi: ఢిల్లీకి వెళ్లనుంది రేవంత్ రెడ్డి కేబినేట్ బృందం. రైతు రుణమాఫీ, ధాన్యం కొనుగోళ్లు, ఖరీఫ్ పంటల ప్రణాళిక, రైతాంగానికి సంబంధించిన పలు కీలకమైన అంశాలపై చర్చించాల్సిన తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం, ఎన్నికల సంఘం నుంచి అనుమతి రాకపోవడంతో, జరక్కుండానే వాయిదా పడింది. మంత్రివర్గ సమావేశం నిర్వహించడానికి ప్రభుత్వం ముందుగానే ఎన్నికల సంఘం అనుమతి కోరింది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరగాల్సిన ఈ సమావేశం కోసం మంత్రులతో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, వివిధ విభాగాల అధికారులు మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు వేచి చూశారు. రాత్రి 7 గంటల వరకు ఈసీ నుంచి ఎలాంటి సమాచారం రాకపోవడంతో భేటీ జరగలేదు. రైతాంగానికి సంబంధించిన అత్యవసరమైన అంశాలతో పాటు జూన్ 2న తెలంగాణ రాష్ట్ర ఆవిర్బావ దినోత్సవ వేడుకల నిర్వహణ, ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పునర్విభజనకు పదేండ్లు పూర్తి కానున్న నేపథ్యంలో ఇప్పటివరకు రెండు రాష్ట్రాల మధ్య పెండింగ్ లో ఉన్న అనేక అంశాలపై కేబినేట్ లో చర్చించాలని ముఖ్యమంత్రి భావించారు. సోమవారం లోపు ఈసీ నుంచి అనుమతి రాకపోతే, అవసరమైతే మంత్రులతో కలిసి ఢిల్లీకి వెళ్లి కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసి అనుమతి కోరాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు.