మనుషులు శాశ్వతం కాదని, కానీ వారు చేసే మంచి ఎప్పటికీ శాశ్వతంగా నిలిచిపోతుందని చిలకలూరిపేట శాసనసభ్యురాలు విడదల రజిని తెలిపారు. స్థానిక మార్కెట్ యార్డులో శనివారం 200 కుటుంబాలకు 50 రకాల నిత్యావసరాలు, కూరగాయలు పంపిణీ చేశారు. స్వచ్ఛంద రక్తదాతల సంఘం గుంటూరు జిల్లా అధ్యక్షుడు కాసా రామశ్రీను ఆధ్వర్యంలో పేద కుటుంబాలకు ఈ సరుకులు, కూరగాయలు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇప్పటికి 39 సార్లు రక్తదానం చేసిన కాసా రామశ్రీను రక్తగ్రహీతల గుండెల్లో నిలిచిపోయారని తెలిపారు. రామశ్రీను మిత్రమండలి ద్వారా 5936 మందికి రక్తదానం చేయడం అభినందించాల్సిన విషయమని కొనియాడారు.
ప్రజలకు మనం ఉపయోగపడితే మనకు సమాజం ఇచ్చే గౌరవాన్ని కొలవడానికి ఏ కొలమానాలు లేవని చెప్పారు. పేదల జీవితాల్లో వెలుగులు నింపుతున్న ప్రభుత్వం తమదని తెలిపారు. పేదల కష్టాలు తెలిసిన వ్యక్తిగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అద్భుతమైన పాలన అందిస్తున్నారని, బడుగులను ఆదుకుంటున్నారని తెలిపారు. తాము చేపడుతున్న సంక్షేమ పథకాలన్నీ పేదల కుటుంబాలకు నేరుగా లబ్ధి చేకూర్చేవేనని చెప్పారు. గతంలో ఏ ప్రభుత్వం ఇలాంటి సాహసోపేత పరిపాలన చేయలేదన్నారు. ఈ రాష్ట్రంలో ఇకపై పేదలకు కష్టాలు ఉండవని స్పష్టంచేశారు. కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు పఠాన్ తల్హాఖాన్, పార్టీ పట్టణ కార్యదర్శి మారుబోయిన నాగరాజు, పార్టీ నియోజకవర్గ అధికార ప్రతినిధి దరియావలి, పార్టీ మైనారిటీ సెల్ పట్టణ అధ్యక్షుడు బేరింగ్ మౌలాలి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కొలిశెట్టి శ్రీనివాసరావు, బొల్లెద్దు చిన్న, తోట బ్రహ్మస్వాములు, కాంతారావు, చెమిటిగంటి పార్వతి, అంజిరెడ్డి, ఉమా శంకర రెడ్డి, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.