సక్సెస్ స్టోరీ : ‘కండోమ్ కింగ్’.. పేరు వెనుక పేద్ద స్టోరీనే ఉంది

-

ఏంటి.. ఈయన పేరే కండోమ్ కింగా? అని నోరెళ్లబెట్టకండి. అవును.. ఆయన్ను అంతా ముద్దుగా కండోమ్ కింగ్ అని పిలుచుకుంటారు. ఎందుకు అలా.. అని అడిగితే.. ఆ ముద్దు పేరు వెనుక పేద్ద స్టోరీనే ఉంది.. కాదు కాదు.. సక్సెస్ స్టోరీ ఉంది. కండోమ్ కింగే కాదు.. మిస్టర్ కండోమ్ అని కూడా పిలుస్తారు ఆయన్ను. బిల్ గేట్స్ తెలుసు కదా మీకు. ఆ బిల్ గేట్స్ కూడా ఈ కండోమ్ కింగ్ ను తెగ మెచ్చుకున్నాడు. ఏందిరా బాబు ఈగోల అసలు విషయం చెప్పేయండి అంటారా? అయితే ఓకే.

అది థాయిలాండ్. మెకయ్ వీరవైద్య అనే వ్యక్తి అక్కడే ఉంటాడు. ఆయన సోషల్ యాక్టివిస్ట్. అంటే.. తన కోసం కాదు… పది మంది కోసం బతుకుతాడు. అలాంటి వాళ్లు ఈరోజుల్లో చాలా అరుదులేండి. ఓరోజు ఉన్నట్టుండి థాయిలాండ్ లో విపరీతంగా పెరుగుతున్న జనాభాను చూసి షాక్ తిన్నాడు మెకయ్. ఎందుకిలా జరుగుతోంది. జనాభా విపరీతంగా పెరిగిపోతుంది. ఒక్కొక్కరు ముగ్గురు, నలుగురు పిల్లలను కంటున్నారు. ఎవరూ కుటుంబ నియంత్రణను పాటించట్లేదని తెలుసుకున్నాడు. అంతే కాదు.. థాయిలాండ్ లో పెరిగిపోతున్న హెచ్ఐవీ కేసులు కూడా మనోడిని బాగా ఆలోచింపజేశాయి. వీటన్నింటిని నియంత్రించాలంటే ఏదో చేయాలి.. ఏం చేయాలి.. అంటూ తెగ ఆలోచించాడు. బుర్ర బద్ధలు చేసుకొని మరీ చించీ.. చించీ.. ఓ అద్భుతమైన ఐడియాను ఆలోచించాడు. అదే కండోమ్. అవును. కండోమ్ అవసరాన్ని అందరికీ తెలియజేయడం ప్రారంభించాడు. అందరినీ కండోమ్ వాడాలంటూ ప్రచారం చేయడం ప్రారంభించాడు. అలా.. మనోడి ప్రచారానికి ఆకర్షితులైన జనాలు కండోమ్ వాడటం ప్రారంభించారు. ఆశ్చర్యం.. కొన్ని రోజుల వ్యవధిలోనే థాయిలాండ్ లో అనూహ్యంగా జనాభా పెరుగుదల ఆగిపోయిందట. అంతే కాదు.. ప్రపంచంలోనే హెచ్ఐవీ పాజిటివ్ కేసులు తగ్గిపోతున్న ప్రాంతంగా థాయిలాండ్ నిలిచిందట. దీంతో మనోడు ఆ ప్రాంతంలో హీరో అయిపోయాడు.

ఇప్పటికీ కండోమ్ ప్రాధాన్యత గురించి అక్కడ రోజూ ప్రచారం చేస్తూనే ఉంటాడు మెకయ్. అందుకే థాయిలాండ్ ప్రజలు కండోమ్ కావాలంటే మెకయ్ అని పిలుస్తారట. మెకయ్ అని పిలుస్తే చాలు కండోమ్ అని వాళ్లు అర్థం చేసుకుంటారు. అలా ముద్దుగా కండోమ్ కింగ్ అని పేరు పెట్టుకున్నారు. మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ మనోడి చొరవ, సర్వీస్ చూసి తెగ మెచ్చుకున్నాడు. అతడి గురించి యూట్యూబ్ లో ఓ వీడియో రూపొందించాడు. తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో మెకయ్ గురించి ఓ పోస్ట్ పెట్టాడు. దీంతో మెకయ్ గురించి ప్రపంచమంతా తెలిసిపోయింది. నెటిజన్లు కూడా మెకయ్ ను ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news