ప్రధాన ప్రతిపక్షం టీడీపీకి ముగ్గరు ఎంపీలు ఉన్నారు. జగన్ సునామీని తట్టుకుని కూడా గెలుపు గుర్రం ఎక్కారు. ప్రతి పక్ష పార్టీ టీడీపీలో అసలేం జరుతుతోంది.. టీడీపీలో త్రిమూర్తులు ముగ్గురూ మూడు దారుల్లో వెళ్తున్నారా అంటే అవుననే సమాధానం వస్తుంది. అయితే, వీరు పార్టీలో ఏమేరకు అధినేత మాట వింటున్నారు? ఏమేరకు చంద్రబాబు కనుసన్న ల్లో నడుస్తున్నారు? అంటే.. చెప్పడం కష్టంగానే ఉందని అంటున్నారు పరిశీలకులు. ముగ్గురు ఎంపీలు ఉన్నా.. ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా ఉన్నారని చెబుతున్నారు. వీరిలో విజయవాడ ఎంపీ కేశి నేని నాని విషయంలో ఈ వ్యాఖ్యలను కొంత వరకు నిజమేనని అనుకోవచ్చు. కానీ, మిగిలిన ఇద్దరు కూడా చంద్రబాబుకు అత్యంత సన్నిహితులు, ఆయన కనుసన్నల్లో నడిచే నాయకులు.
కానీ, వారు కూడా పార్టీలైన్ను దాటేస్తున్నారని అంటున్నారు పరిశీలకులు. ఇదే విషయాన్ని టీడీపీలో చర్చించుకుంటున్నారు కూడా! గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ విషయాన్ని తీసుకుంటే.. ఈయన పైకి మాత్రం టీడీపీ అధినేత చెప్పినట్టు ఉంటున్నారని, కానీ, నిజానికి చంద్రబాబును లెక్కచేయడం లేదని పార్టీ లోనే ఇటీవల ఓగుసగుస బయటకు వచ్చింది. నియోజకవర్గంలో ప్రజలకు అందుబాటులో ఉండ డంతో పాటు.. పార్టీ తరఫున కార్యక్రమాలు నిర్వహించాలని చంద్రబాబు పిలుపు ఇచ్చారు. వీటిలో తనకు నచ్చిన వాటిని చేసిన గల్లా.. మిగిలిన వాటిని పక్కన పెట్టారు. పార్టీ సమావేశాలకు కూడా అటెండ్ కావడం లేదు.
ఇక, విజయవాడ ఎంపీ కేశినేని నాని.. తలబిరుసుగా వ్యవహరిస్తున్నారని పార్టీలోనే ఓ ముద్ర పడింది. దీంతో అధినేత చంద్రబాబు కూడా ఆయనను పట్టించుకోవడం మానేశారు. ఇక, శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ కూడా నిన్న మొన్నటివరకు కూడా చంద్రబాబు కనుసన్నల్లోనే మెలిగారు. ఇప్పుడు కూడా చంద్రబాబు పట్ల ఆయనకు భక్తి ఉంది. అయితే, ఇటీవల కుటుంబంలో రేగిన రాజకీయాలు, అచ్చన్నాయుడు అరెస్టు.. తమ కుటుంబం నుంచి పార్టీలో ముగ్గురు గెలిచినా.. తమకు ప్రాధాన్యం లభించడం లేదనే అసంతృప్తి ఆయనలో ఉన్నాయని అంటున్నారు. దీంతో ఆయన కొన్నాళ్లుగా అంటీముట్టనట్టు వ్యవహరిస్తున్నారని, ఇటీవల పార్టీ కార్యక్రమాలకుకూడా అటెండ్ కాలేదని ప్రచారం జరుగుతుండడం గమనార్హం.