కరోనా భూతం.. ఇప్పట్లో వీడుతుందా? ప్రజల జీవనం సాధారణ పరిస్థితికి వస్తుందా? లాక్డౌన్ నిబంధనలు, ముఖాలకు మాస్కులు తొలగిపోతాయా? ఏ ఇద్దరు వ్యక్తులు కలిసినా.. ఈ విషయాలపైనే చర్చించుకుంటున్నారు. నిజానికి ఎన్నో ఆశలతో ఈ ఏడాదిని ప్రపంచం మొత్తం స్వాగతించింది. 2020పై ప్రజలు ఎన్నో ఆశలు కూడా పెట్టుకున్నారు. అయితే, అనూహ్యంగా తొలి రెండు మాసాల్లోనే కరోనా భూతం వెలుగు చూసింది. ఇది ప్రపంచ దేశాలకు ఫిబ్రవరి నుంచి వ్యాపించడం ప్రారంభించింది. ఆదిలో తేలికగా తీసుకున్నా.. తర్వాత తర్వాత.. దీని పరిస్థితి అందరికీ అర్ధమైంది. గత ఏడాది నవంబరులోనే చైనాలో వెలుగు చూసినప్పటికీ.. దీనిని నిర్ధారించేందుకు ఈ ఏడాది ఫిబ్రవరి వరకు పట్టింది.
దీంతో ఈ ఏడాది ఇప్పటికి ఏడు మాసాలు గడిచి పోయినా.. ఎక్కడా ఎవరి ముఖాల్లోనూ సంతోషం లేదు.. పండగలు లేవు.. సంబరాలు అంతకన్నా లేవు. మరి ఇప్పటికైనా ఇది తొలిగిపోయిందా? త్వరలోనే మన దేశంలో శ్రావణ మాసం పూజలు ప్రారంభం కానున్నాయి. వరుసనే పండగలు కూడా వస్తాయి. అత్యంత కీలకమైన గణపతి ఉత్సవాలు కూడా ప్రారంభం అవుతున్నాయి. గణేష్ ఉత్సవాలను మహారాష్ట్ర సహా హైదరాబాద్‌లో ఎంతో ఘనంగా నిర్వహిస్తారు. ఈ సంబరాలకు జూలై తొలి వారం నుంచే హైదరాబాద్, ముంబై వంటి మహానగరాల్లో శ్రీకారం చుడతారు.
పెద్దపెద్ద విగ్రహాలు తయారీ ప్రారంభమయ్యేది ఈ నెలలోనే. అయితే, ఈ దఫా.. ఈ పండుగ ఆనవాళ్లు ఎక్కడా కనిపించడం లేదు. పందిళ్లకు అనుమతులు కూడా లేవు. దీనిని బట్టి.. సెప్టెంబరులో కూడా కరోనా నినువీడని నీడను నేనే అన్నట్టుగా వెంటాడుతుందనే చర్చ జరుగుతోంది. ఇంతలోనే కేంద్రం ఓ లీకు ఇచ్చింది. ఈ ఏడాది మరో ఆరు మాసాల వరకు కరోనా పోయే అవకాశం లేదని చెప్పకనే చెప్పేసింది. ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ పథకాన్ని మరో మరో 5 నెలల పాటు పొడగిస్తూ.. కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. దీనిని నవంబర్ చివరి వర కు అర్హులైన పేదలకు ఉచితంగా అందనున్నట్టు తెలిపింది.
అదేసమయంలో ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ కంట్రిబ్యూషన్‌ను పొడిగిస్తూ మరో నిర్ణయం తీసుకుంది. ఈ పరిణామాలను బట్టి .. కరోనా ఎఫెక్ట్ ఈ దేశాన్ని డిసెంబరు వరకు వీడే అవకాశం లేదని స్పష్టమవుతోందని అంటున్నారు నిపుణులు. పేదలకు నిత్యావసరాలను ఆదిలో జూన్ వరకే పరిమితం చేసిన కేంద్రం ఇప్పుడు ఏకంగా నవంబరు వరకు పొడిగించడం అంటే.. అప్పటి వరకు దేశవ్యాప్తంగా కరోనా ఎఫెక్ట్ ఉంటుందనే అర్ధమవుతోందని చెబుతున్నారు. సో.. దీనిని బట్టి ఈ ఏడాది కొంప కరోనా అయినట్టేనని చెబుతున్నారు.