కోవిడ్ 19 మహమ్మారి నేపథ్యంలో శనివారం (11-07-2020) వచ్చిన తాజా అప్డేట్లు, ఇతర ముఖ్యమైన వివరాలు..
1. ఇటీవలి కాలంలో ముంబైలో కరోనా కేసులు విపరీతంగా పెరిగినప్పటికీ అక్కడి ధారవి మురికివాడలో కరోనాను విజయవంతంగా కట్టడి చేశారని ప్రపంచ ఆరోగ్య సంస్థ మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశంసించింది. ధారవిని ఒక ఉదాహరణగా తీసుకుని అందరూ కరోనాను కట్టడి చేసేందుకు చర్యలు చేపట్టాలని ఆ సంస్థ సూచించింది.
2. కరోనా వైరస్ పట్ల ప్రజల్లో మరింత అవగాహన పెంచాలని ప్రధాని మోదీ అన్నారు. అహ్మదాబాద్‌లో విజయవంతమైన ధన్వంతరి రథ్ కార్యక్రమాన్ని దేశమంతటా అమలు చేస్తే బాగుంటుందని ఆయన అన్నారు. దేశంలో కరోనా వ్యాప్తిపై మోదీ శనివారం సమీక్షా సమావేశం నిర్వహించారు. కోవిడ్ విషయంలో నిర్లక్ష్యం పనికిరాదని అన్నారు.
3. కరోనా చికిత్సకు గాను డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీజీసీఐ) మరో ఔషధాన్ని వాడేందుకు అనుమతులు ఇచ్చింది. సోరియాసిస్ చికిత్సకు ఉపయోగించే ఇటోలీజుమ్యాజ్ అనే ఇంజెక్షన్‌ను కోవిడ్ ఎమర్జెన్సీ రోగులకు వాడవచ్చని తెలిపింది.
4. తెలంగాణ సీఎం కేసీఆర్ శనివారం ప్రగతి భవన్‌కు చేరుకున్నారు. జూన్ 28న పీవీ శతజయంతి ఉత్సవాల్లో ఆయన ఆఖరిసారి ప్రజలకు కనిపించారు. తరువాత ఎర్రవెల్లిలోని తన వ్యవసాయ క్షేత్రంలో ఇన్ని రోజులూ ఉన్నారు. దీంతో పలువురు ఆయన ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేశారు. అయినప్పటికీ ఆయన ప్రగతి భవన్లో ప్రత్యక్షమై అందరికీ షాకిచ్చారు.
5. కరోనా వైరస్ గురించిన నిజాలను ప్రపంచానికి తెలియకుండా చైనా దాచి పెట్టిందని ఆ దేశానికి చెందిన వైరాలజిస్టు డాక్టర్ లి మెంగ్‌యాన్ వెల్లడించారు. తాను నిజం చెప్పేందుకు అమెరికాకు పారిపోయి వచ్చానన్నారు. కరోనా గురించి చైనాకు ముందే తెలిసినా ప్రపంచాన్ని హెచ్చరించలేదన్నారు.
6. ఇంటి వద్దే ఉండి కరోనా చికిత్స తీసుకుంటున్నవారికి ఏపీ ప్రభుత్వం కరోనా హోం క్వారంటైన్ కిట్లను పంపిణీ చేస్తోంది. తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ కిట్లను పంపిణీ చేయనుంది. వీటిలో కరోనా పేషెంట్లకు 17 రోజులకు సరిపోయే మందులు, విటమిన్ ట్యాబ్లెట్లతోపాటు మాస్కులు, శానిటైజర్ తదితర వస్తువులు ఉంటాయి.
7. గత 100 ఏళ్ల కాలంలో కోవిడ్ 19 ఒక్కటే అతి పెద్ద ఆర్థిక సంక్షోభం సృష్టించిందని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ అన్నారు. శనివారం ఆయన ఎస్బీఐ నిర్వహించిన బ్యాంకింగ్ అండ్ ఎకనామిక్స్ కాన్క్లేవ్ 7వ సదస్సులో పాల్గొని ఆ వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం లాక్డౌన్ ఆంక్షలను సడలిస్తుండడంతో భారత్‌లో ఆర్థిక వ్యవస్థ క్రమంగా కోలుకుంటుందని అన్నారు.
8. ఫార్మా కంపెనీలు కరోనా వ్యాక్సిన్ తయారీలో స్పీడు పెంచాలని, ప్రస్తుతం ఎట్టి పరిస్థితిలోనూ కరోనా వ్యాక్సిన్ అవసరమేనని మైక్రోసాఫ్ట్ అధినేత బిల్‌గేట్స్ అన్నారు. వర్చువల్ కోవిడ్ 19 సమావేశలో ఆయన పాల్గొని మాట్లాడుతూ కరోనా వ్యాక్సిన్‌ను మరింత వేగంగా తయారు చేయాలని అన్నారు.
9. కరోనా వల్ల పురుషుల కన్నా స్త్రీలే ఎక్కువగా సమస్యలను ఎదుర్కొంటున్నారని ఐక్యరాజ్యసమితి వాఖ్యలు చేసింది. మానవాళి మొత్తం ఏకతాటిపైకి వచ్చి కరోనాపై పోరాటం చేయాలని పేర్కొంది. అప్పుడే మనం ఆ మహమ్మారిపై విజయం సాధిస్తామని తెలిపింది.
10. దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 27,114 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 8,20,916కు చేరుకుంది. మొత్తం 22,213 మంది చనిపోయారు. 5,15,386 మంది కోలుకున్నారు. మొత్తం కరోనా కేసుల్లో 2,38,461 కేసులతో మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉండగా.. 1,30,261 కేసులతో తమిళనాడు రెండో స్థానంలో, 1,09,140 కేసులతో ఢిల్లీ మూడో స్థానంలో ఉన్నాయి.