అవును! ఇప్పుడు ఏపీ బీజేపీలో మార్పులపైనే ఇతర పార్టీల్లోనూ చర్చ సాగుతోంది. బీజేపీలో నేతల మధ్య నిన్న మొన్నటి వరకు ఎలాంటి సఖ్యత ఉందో అందరికీ తెలిసిందే. పార్టీ ఏపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ ఒకటి మాట్లాడితే.. పార్టీ సీనియర్ నాయకుడు జీవీఎల్ నరసింహారావు వంటి వారు మరొకటి మాట్లాడారు. మరోపక్క, సోము వీర్రాజు వంటి సీనియర్ నాయకులు ఇంకోరకంగా మాట్లాడారు. ముఖ్యంగా రాజధాని విషయంలో బీజేపీ చెప్పిందే వేదం అని, కేంద్రం ఎట్టిపరిస్థితిలోనూ రాజధాని కదలనీయబోదని కూడా కన్నా చెప్పారు. దీనికి వెంటనే కౌంటర్‌గా అసలు ఈ విషయం కేంద్రం పరిధిలో లేదని జీవీఎల్ అన్నారు. మూడు రాజధానులు ఉండడం బెటరని సోము వంటి సీనియర్లు వ్యాఖ్యానించారు.
ఇక, పురందేశ్వరి వంటి నాయకురాళ్లు.. రాజధానిని సమర్దిస్తూనే.. అమరావతిలో జరిగిన ఇన్సైడర్ ట్రేడింగ్‌పై విచారణ జరగాల ని, కర్నూలును న్యాయ రాజధాని చేయడం అత్యవసరమని, తమ పార్టీ విధానం కూడా అదేనని వెల్లడించారు. ఇలా తలకోరకం గా మాటలు సంధించిన ఈ నాయకులు తర్వాత కూడా అదే తరహా ధోరణిని ప్రదర్శించారు. వైసీపీ నుంచి ఎదురైన కొన్ని విమర్శలను పరిశీలిస్తే.. గత ఏడాది ఎన్నికల సమయంలో కేంద్ర బీజేపీ నుంచి రాష్ట్ర బీజేపీకి అందిన నిధుల విషయంలో కన్నా లక్ష్మీనారాయణ, పురందేశ్వరిలు చేతి వాటం చూపించారని వైసీపీ నాయకుడు విజయసాయిరెడ్డి తీవ్ర సంచలన విమర్శ చేశారు. అయితే, అప్పట్లో నాయకులు సాయిరెడ్డిపై ఎక్కడా విరుచుకుపడింది లేదు. ఆయన చేసిన విమర్శలపై స్పందించింది కూడా లేదు. మౌనం పాటించారు.
అయితే, ఇప్పుడు అదే సాయిరెడ్డి.. చేసిన విమర్శలపై మూకుమ్మడిగా బీజేపీ నాయకులు విరుచుకుపడ్డారు. సాయిరెడ్డి ఏమ న్నారంటే.. టీడీపీ మిడతల దండు.. కమలం తేనె జుర్రుకునేందుకు మూకుమ్మడిగా వస్తోందని కామెంట్ చేశారు. దీంతో ఆ చివరి నుంచి ఈ చివరి వరకు కూడా బీజేపీ నాయకులు ప్రతివిమర్శలు గుప్పించారు. దీంతో అసలు ఏం జరిగింది? ఇంతలోనే నేతలు అంతలా ఎలా మారిపోయారు? అనే ప్రశ్న పొలిటికల్ సర్కిళ్లలో ప్రచారం జరుగుతోంది. దీనికి పెద్ద రీజనే ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పార్టీని బలోపేతం చేసేందుకు కమల నాథులు ఎంచుకున్న మార్గం.. ఇతర పార్టీ లనుంచి నేతలను తమ పార్టీవైపు లాగేయడమే!
ఇలా వచ్చేవారిని ఇతరులు విమర్శిస్తే.. వారు తమ పార్టీలోకి రాకుండాదూరంగా ఉంటారని, దీనివల్ల పార్టీ బలోపేతం కాదు కాబట్టి.. అందరూ కలిసి ఈ విమర్శలను ఎదుర్కొని వచ్చేవారికి రెడ్ కార్పెట్ పరిచి, పార్టీని అధికారంలోకి తీసుకురావాలని భావిస్తున్నారట. ఈ నేపథ్యంలోనే నేతలు భారీగా మారిపోయారని అంటున్నారు. మరి ఈ మార్పు ఎన్నాళ్లు ఉంటుందో చూడాలి.