ఒక ఐడియా.. జీవితాన్ని మార్చేస్తుంది!- ఇది ఓ ప్రకటనే అయినప్పటికీ.. ప్రజల్లో చాలా పాపులారిటీ సంపాయించుకుంది. దీనిని అనేక మంది తన నిజజీవితాలకు కూడా అన్వయించుకున్నారు. ఇక, దీనినే కొన్నాళ్లుగా జపిస్తున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. గత ఏడాది ఎన్నికల్లో పార్టీ డింకీలు కొట్టిన నేపథ్యంలో ఆయన పసుపు పతాకను రెపరెపలాడించేందుకు అనేక రూపాల్లో ప్రయత్నాలు చేస్తున్నారు. ఇలాంటి వాటిలో ఒక ఐడియా.. యువ నాయకత్వం! బూజుపట్టిన సీనియర్లను పక్కనపెట్టి.. యువ రక్తాన్ని నింపుతానని దాదాపు ఏడాది కిందట యువ నేతలను అందరినీ హైదరాబాద్కు పిలిచి మరీ హామీ ఇచ్చారు.
ఈ ఐడియాతో అటు జనసేనకు, వైఎస్సార్ సీపీ దూకుడుకు ఒకే సారి పగ్గాలు వేయాలని బాబు భావించారు. దీంతో యువ నేతలు కూడా హమ్మయ్య మాకు పగ్గాలు లభిస్తున్నాయి. పార్టీలో మాకు కూడా ప్రాధాన్యం ఉంటుంది. అనుకున్నారు. కానీ, ఇప్పటి వరకు చంద్రబాబు ఈఐడియాను ఆచరణలో పెట్టలేక పోయారు. ఫలితంగా యువనాయకత్వం ఎక్కడి గొంగళి అక్కడే అన్నచందంగా మారిపోయింది. పైగా యువ నాయకుల్లో నిరాశ, నిస్పృహలు చోటు చేసుకున్నాయి. దీంతో ఇప్పుడు పార్టీలో వారి ఊసు కూడా వినిపించడం లేదు.
వాస్తవానికి చంద్రబాబు పెద్ద ఆలోచనాపరుడని, ఆయన వేసే అడుగులు వర్కవుట్ కాకుండా ఉండకపోవని అందరూ అనుకున్నారు. ఈ నేపథ్యంలో ఒక ఐడియా పార్టీ భవిష్యత్తును మార్చేస్తుందని అనుకున్నారు. సీనియర్లు అయితే.. పార్టీతో పాటు వివిధ వ్యాపారాలు, వ్యవహారాలను చక్కబెట్టాల్సి ఉంటుంది కాబట్టి.. వారు పార్టీకి కొంచెం దూరమయ్యారంటే.. అర్ధం ఉంది. కానీ, యువ నాయకులు అలాకాదు. వారికి ఇప్పటి వరకుపెద్దగా వ్యాపారాలు, వ్యవహారాల్లో బాధ్యతలు లేవు. సో.. వారికి పార్టీ పగ్గాలు అప్పగిస్తే.. ఫుల్ టైం దూసుకుపోయే అవకాశం ఉంటుంది.
దీంతో రాష్ట్రవ్యాప్తంగా పార్టీ పుంజుకునే అవకాశం ఉంటుంది. యువ నాయకులు కూడా ఇప్పటికే చాలా సార్లు ఈ విషయాన్ని పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లారు. కానీ, ఇప్పటి వరకు చంద్రబాబు వారిపై దృష్టి పెట్టినట్టు లేదు. ఏదైనా అంటే.. త్వరలోనే విడుదల అంటూ ఊరిస్తున్నారే తప్ప.. తన ఐడియాను మాత్రం ఆచరణలో పెట్టడం లేదు. దీంతో పార్టీ ఎప్పటికి పుంజుకుంటుందనే ప్రశ్న వినిపిస్తోంది.