తిరుపతి రేణిగుంట విమానాశ్రయంలో ఇండిగో విమానానికి ముప్పు తప్పింది. బెంగళూరు నుంచి 71 మంది ప్రయాణికులతో వచ్చిన ఈ విమానం ల్యాండింగ్ అవుతున్న సమయంలో రన్ వేపై ఓ ఫైరింజన్ బోల్తా పడింది. చివరి నిమిషంలో ఈ విషయం గుర్తించిన అధికారులు వెంటనే ఇండిగో విమాన పైలెట్ ను అప్రమత్తం చేశారు. ఆ విమానం మళ్లీ గాల్లోకి లేచింది. ఫైరింజన్ ను తొలగించేందుకు సమయం పడుతుందన్న నేపథ్యంలో ఆ విమానాన్ని తిరిగి బెంగళూరుకు మళ్లించారు.
రేణిగుంట విమానాశ్రయంలో ఈ తరహా ఘటన చోటు చేసుకోవడం ఇదే తొలిసారి. ఫైరింజన్ బోల్తా పడటానికి గల కారణాలపై అధికారులు ఆరా తీశారు. అతి వేగం, రన్‌వైపై వర్షపు నీరు నిల్వ ఉండటం వల్ల ఫైరింజన్ బోల్తా పడినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. దీనిపై మరింత సమాచారం రావాల్సి ఉంది. ఈ ఘటనపై రేణిగుంట విమానాశ్రయం డైరెక్టర్ అధికారికంగా ఓ ప్రకటన విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.