కరోనా వైరస్ గాలి ద్వారా కూడా వ్యాప్తి చెందుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పిన విషయం విదితమే. చాలా మంది సైంటిస్టులు ఇదే విషయమై ఆ సంస్థకు లేఖ రాయగా, దాన్ని ఆ సంస్థ సైంటిస్టులు పరిశీలించి అది నిజమే అని తేల్చారు. అయితే తాజాగా కొందరు సైంటిస్టులు చేపట్టిన పరిశోధనల ప్రకారం.. కరోనా ఉన్నవారు మాట్లాడినా వారి మాటల ద్వారా.. పీల్చే శ్వాస ద్వారా కూడా కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుందని గుర్తించారు. అలాగే భౌతిక దూరం పేరిట పాటిస్తున్న 6 అడుగుల దూరం కూడా సరిపోదని అంటున్నారు.
అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ నెబ్రస్కాకు చెందిన పరిశోధకులు భయం గొలిపే విషయాన్ని వెల్లడించారు. కరోనా ఉన్నవారు మాట్లాడితే వారి మాటల ద్వారా.. వారు తీసుకునే శ్వాస ద్వారా.. ఇతరులకు ఆ వైరస్ వ్యాప్తి చెందుతుందని అంటున్నారు. అలాగే కరోనా ఉన్నవారు ఉండే ప్రదేశంలోని గాలిలో 5 మైక్రాన్ల కన్నా సూక్ష్మంగా ఉండే వైరస్ కణాలు చాలా దూరం వరకు ప్రయాణిస్తాయని, అందువల్ల ప్రస్తుతం పాటిస్తున్న 6 అడుగుల (2 మీటర్ల) భౌతిక దూరం కూడా సరిపోదని, ఇంకా ఎక్కువ దూరంలో ఉండాలని అంటున్నారు.
అయితే ఆ సైంటిస్టులు ఈ విషయంపై ఇంకా పరిశోధనలు చేస్తున్నారు. త్వరలోనే దీని గురించిన వివరాలను పబ్లిష్ చేస్తామని తెలిపారు. కనుక ప్రజలు కరోనా పట్ల జాగ్రత్తగా ఉండాలని, బయటకు వెళితే మాస్కులను తప్పనిసరిగా ధరించాలని, హ్యాండ్ శానిటైజర్లను విధిగా వాడాలని సైంటిస్టులు సూచిస్తున్నారు.