ఆ మాటలేవో టీడీపీ నేతలకు చెప్పు రవి!

-

ఆంధ్రప్రదేశ్ లో మూడు రాజధానుల విషయంపై ఆయా పార్టీల నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. మూడు రాజధానుల విషయంలో ఏపీలోని వైసీపీ, టీడీపీ, జనసేన నేతల మధ్య తీవ్రస్థాయిలో మాటల తూటాలు పేలుతున్నాయి. తాజాగా తుళ్లూరులో రైతుల దీక్షకు టీడీపీ ఎమ్మెల్సీ బి.టెక్ రవి మద్దతు తెలిపారు.

అయితే ఈ సందర్భంగా బీటెక్ రవి మీడియాతో మాట్లాడుతూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రైతులకు ధైర్యం చెప్పాలనే పులివెందుల నుంచి తాను వచ్చానని తెలిపిన ఆయన…. కడప జిల్లాలో వైఎస్ కుటుంబం ఎప్పుడు ఓటమి చెందలేదని.. మొట్టమొదటిసారి చంద్రబాబు తనకు ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చిన తర్వాత వారిపై పోరాటం చేసి విజయం సాధించానని వెల్లడించారు.

అదేవిధంగా మండలిలో చర్చకు వచ్చిన వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపామని.. తాము సెలెక్ట్ కమిటీకి పంపిన కారణంగా జగన్ మండలి రద్దుకు రెడీ అయ్యారని తెలిపారు. అయితే బడ్జెట్ సమావేశాల్లో కూడా ఈ బిల్లులను ఆమోదించుకోవడానికి ప్రయత్నించారని అన్నారు. ఆ సమయంలో మండలిలో మంత్రులు ఎంత హంగామా చేశారో అందరూ చూశారని అన్నారు. మండలిలో తాము కష్టపడి బిల్లులను ఆపితే వారు దొడ్డిదారినా గవర్నర్ కి పంపి ఆమోదించుకున్నారని చెప్పుకొచ్చారు.

ఇదే క్రమంలో… చట్టసభలకు విలువ లేనప్పుడు ఎమ్మెల్సీగా ఉండి ప్రయోజనం ఏముంది? అందుకే రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. కాగా గతంలో అమరావతి మార్చమని.. మేనిఫెస్టో కమిటీ చైర్మన్ గా ఉన్న ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు చెప్పారు. ఇప్పుడు రాజధాని మారుస్తున్నారు మరి ప్రజలకు ఏం చెప్తారని ప్రశ్నించారు.

ఈ ప్రాంత ప్రజల చేత ఓట్లు వేయించుకొని ఎమ్మెల్యేలుగా గెలిచిన వైసీపీ నేతలు దమ్ముంటే రాజీనామా చేయాలని అంటున్న బీటెక్ రవి… మూడు రాజధానులను రెఫరెండంగా ఎన్నికలకు వెళ్ళాలని డిమాండ్ చేస్తున్నారు. అంతేకాకుండా రైతులు అధైర్య పడవొద్దు…. అంతిమ విజయం రైతులదే అంటూ రైతులకు దైర్యం చెప్పారు బీటెక్ రవి. అంతా బాగుంది కానీ.. ఇదే బీటెక్ రవి ఘాటు వ్యాఖ్యలను స్పూర్తిగా తీసుకొని ముందు టీడీపీ నేతలు రాజీనామాలు చేసి గెలిచి.. ఆ తర్వాత వైసీపీ నేతలను రాజీనామాలు చేస్తే బాగుంటుందని అదే సమంజసం అంటున్నారు విశ్లేషకులు.

Read more RELATED
Recommended to you

Latest news