కేరళలోని పినరయి విజయన్ ప్రభుత్వం ఇస్రో సైంటిస్టు నంబి నారాయణన్‌కు రూ.1.30 కోట్ల నష్ట పరిహారం చెల్లించింది. చేయని తప్పుకు ఆయనను అరెస్టు చేసి ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆయన్ను వేధింపులకు గురి చేసింది. దీంతో ఆయన ఆ రాష్ట్రంపై న్యాయపోరాటంలో గెలిచారు. నంబి నారాయణన్ ఎలాంటి తప్పు చేయలేదని సీబీఐ క్లీన్ చిట్ ఇవ్వడంతో ఆయన ఎట్టకేలకు ఈ కేసులో గెలిచారు. దీంతో కేరళ ప్రభుత్వం ఆయనకు ఆ మొత్తాన్ని నష్ట పరిహారం కింద చెల్లించింది.
2019 డిసెంబర్ నెలలో కేరళ ప్రభుత్వం ఇస్రో సైంటిస్టు నంబి నారాయణన్‌ను అరెస్టు చేసింది. 1994లో కీలకమైన రక్షణ విభాగం రహస్యాలను మాల్దీవియన్ ఇంటెలిజెన్స్‌కు చేరవేశారన్న ఆరోపణలతో నారాయణన్‌ను అరెస్టు చేశారు. తరువాత 50 రోజుల పాటు ఆయన కస్టడీలో ఉన్నారు. ఆ సమయంలో ఆయనను వేధింపులకు గురి చేయడంతో ఆయన నేరం చేయకపోయినా.. చివరకు అంగీకరించే స్థితికి వచ్చారు. అయితే ఇంతలో సీబీఐ రంగ ప్రవేశం చేసి కేసు పూర్వాపరాలను విచారించింది.
ఈ క్రమంలో నారాయణన్‌ను తప్పుగా అరెస్టు చేశారని, ఆయన ఆ నేరం చేయలేదని సీబీఐ తేల్చింది. దీంతో సుప్రీం కోర్టు నారాయణన్‌కు అనుకూలంగా తీర్పు ఇచ్చింది మొత్తం రూ.1.20 కోట్లను చెల్లించాలని చెప్పింది. అయితే ఇప్పటికే అందులో రూ.60 లక్షలను ఆయనకు చెల్లించగా.. మిగిలిన మొత్తాన్ని కేరళ ప్రభుత్వం ఆయనకు తాజాగా అందజేసింది. ఇక హ్యూమన్ రైట్స్ వారు కూడా రూ.10 లక్షలను ఆయనకు నష్ట పరిహారం కింద చెల్లించాలని కేరళ ప్రభుత్వాన్ని ఆదేశించారు. దీంతో మొత్తం కలిపి ఆయనకు రూ.1.30 కోట్ల నష్ట పరిహారం అందింది.
కాగా నారాయణన్ కు మోదీ ప్రభుత్వం గతంలో పద్మ భూషణ్ అవార్డు ఇచ్చింది. నారాయణన్ కేసు విషయమై కేరళలోని త్రిసూర్‌లో గతంలో మోదీ నిర్వహించిన ఓ ర్యాలీలో ఆయన కేరళ ప్రభుత్వంపై మండిపడ్డారు. రాజకీయ లబ్ధి కోసం ఓ సైంటిస్టు పేరు ప్రతిష్టలకు భంగం కలిగించే పనిచేస్తున్నారని అన్నారు. ఇక నారాయణన్ అరెస్టు కాకముందు ఆయన ఇస్రోలోని క్రయోజెనిక్స్ విభాగంలో పనిచేస్తుండేవారు. ఆయన లిక్విడ్ ఫ్యుయల్ రాకెట్ టెక్నాలజీని అభివృద్ధి చేశారు. అప్పటి వరకు రాకెట్లలో సాలిడ్ మోటార్స్ ను వాడేవారు. కానీ ఆయన డెవలప్ చేసిన టెక్నాలజీ వల్ల రాకెట్లలో ఆ ఫ్యుయల్‌ను వాడడం మొదలు పెట్టారు. మొదటిసారిగా పీఎస్ఎల్‌వీని లాంచ్ చేసినప్పుడు కూడా నారాయణన్.. వికాస్ ఇంజిన్ పేరిట ఓ ఇంజిన్ డెవలప్ చేసి అందులో ఉపయోగించారు. ఇలా ఎన్నో ఘనతలను ఆయన సాధించారు.