కోవిడ్ 19 మహమ్మారి నేపథ్యంలో గురువారం (20-08-2020) వచ్చిన తాజా అప్డేట్లు, ఇతర ముఖ్యమైన వివరాలు..
1. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ రూపొందించిన కోవిషీల్డ్ వ్యాక్సిన్‌ను సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా దేశంలోని 17 ప్రాంతాల్లో పరీక్షించనుంది. ఫేజ్ 2, 3 క్లినికల్ ట్రయల్స్ చేపట్టనున్నారు. ఇందుకు 1600 మంది వాలంటీర్లను ఎంపిక చేయనున్నారు.
2. కేరళలోని కోజికోడ్ విమానాశ్రయంలో ఇటీవల జరిగిన విమాన ప్రమాదంలో బాధితులకు సహాయం అందించినందుకు గాను 22 మంది కరోనా బారిన పడ్డారు. సహాయక చర్యల్లో పాల్గొన్న వారికి కరోనా టెస్టులు చేయగా.. వారిలో 22 మందికి కరోనా సోకినట్లు గుర్తించారు.
3. దుబాయ్‌లో సెప్టెంబర్ 19 నుంచి జరగనున్న ఐపీఎల్‌కు ఫ్రాంచైజీలు దుబాయ్‌కు ప్రయాణమయ్యాయి. ఈ సందర్భంగా బీసీసీఐ ప్లేయర్లు, ఫ్రాంచైజీలను కరోనా రూల్స్ బ్రేక్ చేయరాదని హెచ్చరించింది. నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపింది.
4. ఏపీలో కొత్తగా 9,393 కరోనా కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 3,25,396కు చేరుకుంది. 2,35,218 మంది కోలుకున్నారు. 87,177 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 3001 మంది చనిపోయారు.
5. మహారాష్ట్రలో కొత్తగా 14,492 కరోనా కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 6,43,289కు చేరుకుంది. 1,62,491 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 4,59,124 మంది కోలుకున్నారు. 21,359 మంది చనిపోయారు.
6. కరోనా మహమ్మారి నేపథ్యంలో మార్చి నెలలో లాక్డౌన్ వల్ల తాజ్ మహల్ సందర్శనను నిలిపివేశారు. అయితే త్వరలో తాజ్ మహల్‌ను సందర్శించేందుకు పర్యాటకులకు అనుమతి ఇవ్వనున్నారు. ఈ మేరకు ఆగ్రా జిల్లా మెజిస్ట్రేట్ పీఎన్ సింగ్ అధికారులతో సమీక్ష నిర్వహించారు.
7. కోవిడ్‌కు మందులేదని, ధైర్యంగా ఉండడమే ఏకైక మార్గమని మంత్రి ఈటల రాజేందర్ పేర్కొన్నారు. హైదరాబాద్ ఖైరతాబాద్ విశ్వేశ్వరయ్య భవన్లో ప్లాస్మా దానం కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. హైదరాబాద్ పోలీసుల ఆధ్వర్యంలో ప్లాస్మా దానం కార్యక్రమం నిర్వహించారు.
8. కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షేకావత్ కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. అలాగే గత కొన్ని రోజులుగా ఆయనని కలిసిన వాళ్ళు టెస్ట్ చేయించుకోవాలని ఆయన కోరారు.
9. దేశంలో కొత్తగా 69,652 కరోనా కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 28,36,926కు చేరుకుంది. 53,866 మంది చనిపోయారు. 6,86,395 మంది చికిత్స తీసుకుంటున్నారు. 20,96,665 మంది కోలుకున్నారు.
10. తెలంగాణలో కొత్తగా 1724 కరోనా కేసులు నమోదయ్యాయి. మొత్తం 729 మంది చనిపోయారు. మొత్తం కేసుల సంఖ్య 97,424కి చేరుకున్నాయి. 21,509 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 75,186 మంది కోలుకున్నారు.