ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తుంది. తెలంగాణలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. ఇప్పటికే ఎంతో మంది ప్రజలతో పాటు, ప్రజాప్రతినిధులు, అధికారులు కూడా డిని బారిన పడ్డారు. ఈ మహమ్మారి సోకి ఇప్పటికే అనేకమంది మృతి చెందగా.. మరి కొందరు కోలుకుని బయటపడ్డారు. తాజాగా.. మాజీ మంత్రి, టీఆర్ఎస్ నేత జూపల్లి కృష్ణారావుకు కరోనా సోకింది. దీంతో వైద్యుల సలహా మేరకు ఇంట్లోనే ఉండి చికిత్స తీసుకుంటున్నారు జూపల్లి. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే వెల్లడించారు.
అలాగే గత కొన్నిరోజులుగా తనను కలిసిన ప్రజలు, నేతలు, పార్టీ కార్యకర్తలు పరీక్షలు చేయించుకోవాలని ఆయన కోరారు. అయితే ఇప్పటికే ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్థన్ రెడ్డి, గొంగిడి సునీత దంపతులు, డిప్యూటీ స్పీకర్ పద్మారావు, సుధీర్ రెడ్డి, హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్ తదితరులకు కరోనా సోకింది. ఇక కాంగ్రెస్ నేతలు వి.హనుమంతరావు, గూడూరు నారాయణరెడ్డి, బీజేపీ మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డికి సైతం కరోనా సోకిన విషయం తెలిసిందే. ఐతే వీరంతా ఇప్పటికే కోలుకొని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు.