ప్రధాని మోదీ ‘మన్ కీ బాత్’ కార్యక్రమానికి గతంలో ఎన్నడూ లేనన్ని డిస్‌లైక్‌లు వచ్చాయి. బీజేపీ యూట్యూబ్ ఛానల్‌లో ఉన్న ఈ కార్యక్రమానికి ఇప్పటివరకు 1.6 లక్షల లైక్స్ రాగా, 8.5 లక్షల డిస్‌లైక్‌లు రావడం గమనార్హం. దీనిపై బీజేపీ స్పందిస్తూ, డిస్‌లైక్స్ లో 98% విదేశాల నుంచే వచ్చాయని వెల్లడించింది. అయితే నీట్,జేఈఈ పరీక్షలు వాయిదా వేయాలన్న విద్యార్థుల ఆగ్రహం మోదీ వీడియోకి భారీ డిస్‌లైక్స్ రావడంలో ప్రధాన కారణమని నిపుణుల మాట. అలాగే చాలామంది విద్యార్థులు కామెంట్ సెక్షన్‌లో తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.
ఇక పీఎంవో యూట్యూబ్ ఛానల్‌లోనూ డిస్‌లైకుల మోత కొనసాగుతుంది. దీని వెనక కాంగ్రెస్ పాత్ర ఉందని బీజేపీ ఆరోపించింది. కాగా, ఆగస్టు 30 న జాతిని ఉద్దేశించి మోడీ రేడియో ద్వారా ‘మన్ కీ బాత్’ వినిపించారు. ఈ కార్యక్రమంలో ఆయన ఆట బొమ్మలను మన దేశంలోనే తయారు చేసుకోవాలని, దేశీయ కుక్కలను పెంచుకోవాలని చెప్పారు. అయితే ఈ కార్యక్రమంలో జేఈఈ, నీట్ పరీక్షల గురించి మోడీ మాట్లాడకపోవడాన్ని చాలా మంది ప్రశ్నించారు.