లాక్డౌన్ సమయంలో వలస కూలీలు ఎన్నో ఇబ్బందులు పడ్డారు. పనిలేక, ఉండడానికి చోటు లేక, సొంతూళ్ళకి వెళ్ళడానికి రవాణా సౌకర్యాలు లేక కాలినడకన సొంత ఊరికి ప్రయాణమయ్యారు. అలా వెళ్తూ వెళ్తూ చాలామంది తమ ప్రాణాలు పోగొట్టుకున్నారు. లాక్డౌన్ టైమ్ లో వలస కూలీలకి రవాణా సౌకర్యాలు, తాగడానికి నీరు, తినడానికి తిండి అందించడంలో కేంద్రం విఫలమైందని ప్రతిపక్షాలు విమర్శలు చేసాయి.
ఐతే లాక్డౌన్ టైమ్ లో వలస కూలీల చావులకి కారణం ఫేక్ న్యూస్ అంటూ కేంద్రం మాట్లాడింది. పార్లమెంటులో తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మలరాయ్ అడిగిన ప్రశ్నకి కేంద్ర హోమ్ శాఖా సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ ఈ విధంగా జవాబు చెప్పారు. లాక్డౌన్ టైమ్ లో ఫేక్ న్యూస్ వైరల్ కావడం వల్లే వలసకూలీలు అన్ని ఇబ్బందులు పడ్డారని, ఆ ప్రభావం వల్లనే వాళ్ళలో భయం పెరిగిపోయిందని, అది వాళ్ళ చావుకు కారణమైందని మాట్లాడారు. లాక్డౌన్ టైమ్ జనాలకి ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండేందుకు ప్రభుత్వం అనుక్షణం తపించిందని అన్నారు.