జమ్మూ కాశ్మీర్ లోని రేవా ప్రాంతంలో గురువారం 52 కిలోల పేలుడు పదార్థాలను భారత ఆర్మీ స్వాధీనం చేసుకుంది. పుల్వామా ఎటాక్ తరహాలో భారీగా ఉగ్రవాదుల కుట్రను భగ్నం చేసారు. ఇది గత ఏడాది దాడి జరిగిన ప్రదేశానికి చాలా దగ్గరలో ఉంది. పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్న ప్రదేశం జమ్మూ కాశ్మీర్ హైవే సమీపంలో ఉందని, పుల్వామా దాడి జరిగిన ప్రదేశానికి కేవలం తొమ్మిది కిలోమీటర్ల దూరంలో ఉందని అధికారులు వివరించారు.
“మేము మరొక పుల్వామా తరహా దాడిని తప్పించాము” అని ఆర్మీ అధికారి ఒకరు తెలిపారు. ఉదయం 8 గంటల ప్రాంతంలో జరిపిన శోధనలో గడికల్‌లోని కరేవా ప్రాంతంలోని సింటెక్స్ వాటర్ ట్యాంక్‌లో పేలుడు పదార్థాలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. “ఒక్కొక్కటి 125 గ్రాముల బరువున్న 416 ప్యాకెట్ల పేలుడు పదార్థాలు ఉన్నాయి” అని ఒక అధికారి తెలిపారు, ఈ ప్రాంతంలోని మరో సింటెక్స్ ట్యాంక్‌లో మరో 50 డిటోనేటర్లను స్వాధీనం చేసుకున్నారు. పేలుడు పదార్థాలను “సూపర్ -90” లేదా ఎస్ -90 అని పిలుస్తారు.