ఏపీలో వైసీపీ ప్రభుత్వం వివక్షతతో వ్యవహరిస్తోందని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు పేర్కొన్నారు. హిందూ ఆలయాలపై దాడులు జరిగితే ఒకలా, ఇతర ప్రార్థనా మందిరాలపై దాడులు జరిగితే మరోలా స్పందిస్తోందని, హిందూ ఆలయాలపై దాడులు జరిగితే మతిస్థిమితం లేనివాళ్ల చర్య అంటున్నారని అన్నారు. అంతర్వేది రథం ఘటనను సీబీఐకి అప్పగించి చేతులు దులుపుకున్నారని, సీబీఐకి కేసు ఇచ్చేలోపు రాష్ట్ర పోలీసులు ఏం చేశారు? అని ఆయన ప్రశ్నించారు.
బీజేపీ నేతల అంతర్వేది కార్యక్రమాన్ని ప్రభుత్వం అడ్డుకుందని, బీజేపీ నేతలను ఎక్కడికక్కడ అరెస్టు చేసి అణచివేత చర్యలకు పాల్పడుతోందని అన్నారు. కేవలం అంతర్వేది ఘటనపైనే కాదు, రాష్ట్రంలో హిందూ దేవాలయాలపై జరుగుతున్న అన్ని దాడులపైనా సీబీఐ విచారణ పరిధిలోకి తేవాలని అన్నారు. టీడీపీ హయాంలోనూ హిందూ ఆలయాలపై వివక్ష కొనసాగిందన్న ఆయన విజయవాడ దుర్గ గుడిలో క్షుద్రపూజలు కూడా బాబు హయాంలోనే జరిగాయని అన్నారు. పాకిస్తాన్లో అణచివేతకు గురవుతున్న హిందువులు భారత్ శరణు కోరుతున్నారని ఇప్పుడు ఆంధ్రాలో హిందువులు ఎక్కడ శరణుకోరాలి? అని ఆయన ప్రశ్నించారు.