ప్రస్తుతం సీఎం జగన్ దర్శనం కావాలంటే.. ఎప్పుడు దొరుకుతుందో చెప్పలేని పరిస్థితి. నిజమే. ఆయన బిజీ ఆయనది. సీఎంగా, పార్టీ అధినేతగా.. ఆయన ఆయన దూసుకుపోతున్నారు. ఈ క్రమంలో రాష్ట్ర సమస్యలపై ఆయన నిత్యం పోరాటం చేస్తున్నారు. ఈ సమయంలో అధికారిక కార్యక్రమాలకే సమయం సరిపోవడం లేదనేది ముఖ్యమంత్రి కార్యాలయం వాదన. దీంతో మంత్రులకు కూడా ఇటీవల కాలంలో అప్పాయింట్‌మెంట్ చాలా చాలా తక్కువగా లభిస్తోంది. ఇక చాలా మంది ఎమ్మెల్యేలకు జగన్ దర్శనభాగ్యమే దొరకని పరిస్థితి ఉంది. అలాంటిది.. విజయవాడకు చెందిన యువ నాయకుడు దేవినేని అవినాష్‌కు మాత్రం జగన్ ప్రాధాన్యం ఇస్తుండడం పార్టీలో చర్చనీయాంశంగా మారింది. అవినాష్ తరచూ సీఎంను కలుస్తూ నియోజకవర్గ అభివృద్ధి కోసం నిధులు రాబట్టుకుంటున్నారు.
తాజాగా సీఎం జగన్‌ను ఆయన క్యాంపు కార్యాలయంలో కలిసిన అవినాష్.. తూర్పు నియోజకవర్గ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనులు, పార్టీ పటిష్ఠతకు తీసుకుంటున్న చర్యలను వివరించినట్టు తెలిసింది. గత ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగా పెండింగులో ఉన్న ముస్లిం మైనారిటీలకు షాదీఖానా, కాపు కళ్యాణ మండపం నిర్మాణం కోసం కూడా నిధులు మంజూరు చేయవలసిందిగా కోరినట్టు తెలుస్తోంది. దీనికి సీఎం కూడా సానుకూలంగా స్పందించారని సమాచారం. వీలైనంత త్వరగా సంబంధిత అధికారులతో సమీక్షించి నిధులు విడుదల చేస్తామని హామీ ఇవ్వడం జరిగిందని తెలుస్తోంది.
అంతేకాదు, చాలా ఆప్యాయంగా కూడా దేవినేని అవినాష్‌తో సీఎం సమయం గడిపడడం ఆసక్తిగా మారింది. అయితే, ఇంతగా ఇజీగా ఉండి.. కూడా సీఎం జగన్ అవినాష్‌కు ప్రాధాన్యం ఇవ్వడం వెనుక ఉన్న రీజనేంటి? అనేది కీలకంగా మారింది. ఈ విషయాన్ని పరిశీలిస్తే.. విజయవాడలో టీడీపీ ఆధిపత్యం ఎక్కువగా ఉంది. పైగా కమ్మ సామాజిక వర్గం ఇక్కడ ఎక్కువగా చక్రం తిప్పుతోంది. ఈ నేపథ్యంలో రాజకీయంగా యువ నాయకుడిని ప్రోత్సహించాలనేది జగన్ నిర్ణయంగా కనిపిస్తోంది.
అవినాష్ కూడా వివాద రహితుడిగా అందరినీ కలుపుకొని పోవడం, రాజకీయంగా కుటుంబానికి ఇక్కడ ఎంతో ప్రాధాన్యం ఉండడం, బలమైన కేడర్ ఉండడం వంటి అంశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని అంటున్నారు పరిశీలకులు. భవిష్యత్తులో బెజవాడ వైసీపీ రాజకీయాల్లో అవినాష్ బలమైన నేతగా ఎదిగేందుకు పటిష్టమైన పునాదులు పడుతున్నాయి. మొత్తానికి అవినాష్‌కు మంచి ఫ్యూచర్ ఉంటుందని అంటున్నారు పరిశీలకులు.
-Vuyyuru Subhash