టీడీపీలో హాట్ టాపిక్‌.‌.. ఆ సీనియ‌ర్‌ల మౌనంపైనే…!

-

రాష్ట్రంలో టీడీపీకి అత్యంత కీలక‌మైన జిల్లా ఏదైనా ఉంటే.. విశాఖ త‌ర్వాత అది గుంటూరే. ఇక్క‌డే పార్టీ రాష్ట్ర కార్యాల‌యం నిర్మించుకున్నారు. పార్టీకి కీల‌క‌మైన క‌మ్మ సామాజిక వ‌ర్గం నేత‌లు ఎక్కువ‌గా ఉన్న‌ది కూడా ఇక్క‌డే. పైగా చంద్ర‌బాబు నివాసం ఉన్న‌ది కూడా ఇక్క‌డే. దీంతో ఈ జిల్లాను టీడీపీ అధినేత చంద్ర‌బాబు చాలా ప్ర‌తిష్టాత్మ‌కంగా భావించారు. అయితే, ఆయ‌న అనుకున్న విధంగా నాయ‌కులు ఇక్క‌డ దూకుడు ప్ర‌ద‌ర్శిస్తున్నారా? అనేది సందేహంగా మారింది. ముఖ్యంగా క‌మ్మ సామాజిక వ‌ర్గానికి చెందిన సీనియ‌ర్లు ఇక్క‌డ ఒక‌రిద్ద‌రు మాత్ర‌మే పార్టీలో యాక్టివ్‌గా ఉన్నారు. మిగిలిన వారు మాత్రం సైలెంట్‌గా ఉంటున్నారు.

పొన్నూరు మాజీ ఎమ్మెల్యే దాదాపు ఐదు ఎన్నిక‌ల్లో వ‌రుస విజ‌యాలు సాధించిన ధూళిపాళ్ల న‌రేంద్ర‌, న‌ర‌సారావు పేట మాజీ ఎంపీ.. రాజ‌కీయ కురువృద్ధుడు రాయ‌పాటి సాంబ‌శివ‌రావు స‌హా చాలా మంది నాయ‌కులు ఇటీవ‌ల కాలంలో మౌనంగా ఉంటున్నారు. వాస్త‌వానికి రాజ‌ధాని అమ‌రావ‌తిని త‌ర‌లించే కార్య‌క్ర‌మానికి జ‌గ‌న్ స‌ర్కారు తెర‌దీసిన‌ప్పుడు చంద్ర‌బాబు అనేక రూపాల్లో ఉద్య‌మించేందుకు ప్ర‌ణాళిక వేసుకున్నారు. అప్పుడు కూడా వీరు పెద్ద‌గా యాక్టివ్‌గా స్పందించ‌లేదు. రాయ‌పాటి కుటుంబం ఎన్నిక‌ల త‌ర్వాత సైలెంట్ అయ్యింది. ఇక‌, న‌రేంద్ర కూడా కేవ‌లం ఒకే ఒక్క‌సారి రాజ‌ధాని గ్రామాల‌కు వ‌చ్చి మ‌ద్ద‌తు తెలిపి వెళ్లిపోయారు.

అప్ప‌టి నుంచి వారి కార్య‌క్ర‌మాల్లో వారు బిజీ అయిపోయారు. ఈ ప‌రిణామాల‌ను విశ్లేషించుకుంటే.. వారు పార్టీలోనే ఉన్న‌ప్ప‌టికీ.. పార్టీకి ఏరకంగానూ ప‌నిచేయ‌డం లేద‌ని చంద్ర‌బాబు భావిస్తున్నారు. అయితే, ఆయా నేత‌లు .. చంద్ర‌బాబు త‌మ‌ను ప‌ట్టించుకోవ‌డం లేదు కాబ‌ట్టి మేమెందుకు దూకుడుగా ఉండి కేసులు పెట్టించుకోవాల‌ని అనుకుంటున్నారు. పైగా య‌ర‌ప‌తినేని శ్రీనివాస‌రావు, జీవీ ఆంజ‌నేయులు వంటివారే కాస్తో కూస్తో దూకుడుగా ఉంటున్నారు. మిగిలిన నేత‌లు కాడి కింద ప‌డేశారు. దీంతో పార్టీని సంస్క‌రించ‌డమా ?  లేక .. వీరిలోనే మార్పు తెచ్చేలా చేయ‌డ‌మా ? అనే విష‌యంపై చంద్ర‌బాబు త‌ర్జ‌న భ‌ర్జ‌న ప‌డుతున్నార‌ని అంటున్నారు.

ఇప్ప‌టికిప్పుడు వీరిపై చ‌ర్య‌లు తీసుకున్నా ప్ర‌యోజ‌నం లేద‌ని బాబు భావిస్తున్నార‌ని మ‌రో వ‌ర్గం అంటోంది. అయితే, యాక్టివ్‌గా ఉన్న ఆల‌పాటి రాజేంద్ర ప్ర‌సాద్ వంటివారు.. అంతా నెత్తినే వేస్తున్నారు.. అనే అస‌హ‌నం వ్య‌క్తం చేస్తున్నారు. ఈ ప‌రిణామాల‌తో గుంటూరు టీడీపీలో తీవ్ర‌మైన చ‌ర్చ సాగుతోంది. దీనికి త్వ‌ర‌లోనే ముగింపు ప‌లికి.. స‌త్వ‌ర‌మే కాయ‌క‌ల్ప చికిత్స చేయాల‌నే డిమాండ్లు తెర‌మీద‌కి వ‌స్తున్నాయి. మ‌రి బాబు ఏం చేస్తారో చూడాలి. ఏదేమైనా కీల‌క‌మైన గుంటూరులో ఏ కార్య‌క్ర‌మం చేప‌ట్టినా .. కృష్ణా జిల్లా నుంచి నేత‌ల‌ను తీసుకురావ‌డం పార్టీకి ఇబ్బందిక‌రంగానే మారింద‌నేది స‌త్యం!!

-Vuyyuru Subhash

Read more RELATED
Recommended to you

Latest news