ఊహించని విధంగా విశాఖ సౌత్ టీడీపీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేశ్ కుమార్ జగన్‌కు జై కొట్టిన విషయం తెలిసిందే. పదవికి రాజీనామా చేయకుండా వైసీపీ ప్రభుత్వానికి మద్ధతు తెలిపారు. అలాగే ఆయన కుమారులకు వైసీపీ కండువా కప్పించారు. అంటే ఇక నుంచి ఈ టీడీపీ ఎమ్మెల్యే అనధికార వైసీపీ ఎమ్మెల్యేగా కొనసాగనున్నారు. అయితే ఇక్కడవరకు అంతా బాగానే ఉంది కానీ, నియోజకవర్గంలో ఉన్న వైసీపీ నేత ద్రోణంరాజు శ్రీనివాస్ పరిస్థితి ఏంటి అనేదానిపై క్లారిటీ లేకుండా పోయింది. ద్రోణంరాజుని సైడ్ చేసేసి నియోజకవర్గంలో పెత్తనం వాసుపల్లికి అప్పగించే అవకాశాలున్నాయని తెలుస్తోంది.
ఎందుకంటే టీడీపీని వీడి వైసీపీ ప్రభుత్వానికి మద్ధతు తెలిపిన ముగ్గురు ఎమ్మెల్యేల విషయంలో ఇదే జరిగింది. గన్నవరంలో వంశీ వైసీపీ వైపుకు వస్తే, ఆయన చేతిలో ఓటమి పాలైన యార్లగడ్డ వెంకట్రావుకు కోపరేటివ్ బ్యాంక్ ఛైర్మన్ పదవి ఇచ్చి, ఆయన్ని సైడ్ చేశారు. అటు గుంటూరు వెస్ట్‌లో మద్దాలి గిరిని తీసుకుని, ఆయన చేతిలో ఓడిన చంద్రగిరి యేసురత్నంకు మిర్చి యార్డ్ ఛైర్మన్ పదవి ఇచ్చి, సైడ్ చేశారు. ఇక చీరాలలో కరణం బలరాంని తీసుకోగా, అక్కడ ఆమంచి కృష్ణమోహన్‌ని వేరే నియోజకవర్గానికి పంపాలని చూస్తున్నట్లు తెలుస్తోంది.
ఇలా టీడీపీ ఎమ్మెల్యేలు వచ్చిన ప్రతిచోటా, వారి చేతిలో ఓడిపోయిన వైసీపీ నేతలకు ఏదొక పదవులు ఇచ్చేసి సైడ్ చేసేశారు. ఇక ఇప్పుడు విశాఖ సౌత్‌లో ద్రోణంరాజు వంతు వచ్చింది. ఇక్కడ వాసుపల్లిని తీసుకోవడంతో, ద్రోణంరాజుని పక్కకు తప్పించడం ఖాయంగా కనిపిస్తోంది. ఎందుకంటే ఇప్పటికే ద్రోణంరాజుకు కీలక పదవి ఇచ్చేశారు. విశాఖపట్నం మెట్రో రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ గా ద్రోణంరాజు శ్రీనివాస్‌ను నియమించారు. కాబట్టి సౌత్‌పై ఇక పెత్తనం అంతా వాసుపల్లిదే అని అర్ధమవుతుంది. వచ్చే ఎన్నికల్లో కూడా వాసుపల్లి ఇక్కడ నుంచి వైసీపీ తరపున పోటీ చేయొచ్చు.
-Vuyyuru Subhash