కేంద్రప్రభుత్వ ఆలోచన జాతీయస్థాయిలో ప్రతిష్ఠాత్మక సంస్థలుగా పేరుగాంచిన ఐఐటీ, ఎన్‌ఐటీలల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జేఈఈ మెయిన్, అడ్వాన్స్‌డ్ పరీక్షలకు హాజరయ్యే ఎస్సీ, ఓబీసీ విద్యార్థులకు పట్నాలోని ‘సూపర్ 30’ కోచింగ్ కేంద్రం ద్వారా శిక్షణ ఇప్పించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ, ‘సూపర్ 30’ వ్యవస్థాపకుడు ఆనంద్ కుమార్ ఓ అవగాహనకు రానున్నారు.
దేశంలోని రెండు వేల మంది ఎస్సీ, ఓబీసీ విద్యార్థులకు ఆన్లైన్ ద్వారా ఉచితంగా శిక్షణ ఇప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. కోచింగ్కు ఎంపికైన విద్యార్థులకు లాప్టాప్/ట్యాబ్లు ఇవ్వనున్నారు. సూపర్ -30 ఆనంద్పై హిందీలో సినిమా కూడా వచ్చింది. ఆనంద్కు ఇప్పటికే ఎన్నో జాతీయ, అంతర్జాతీయ అవార్డులు లభించాయి. ఇతడి దగ్గర కోచింగ్ తీసుకున్న వేలాదిమంది పేద విద్యార్థులు ఐఐటీ, ఎన్ఐటీ, ఐఐఐటీ వంటి సంస్థలలో ఇంజినీరింగ్ సీట్లు పొందారు.
కార్పొరేట్ కోచింగ్ సెంటర్లకు ధీటుగా ఆనంద్ తనదైన శైలిలో కోచింగ్ ఇస్తారు. కేంద్రం చర్చలు సఫలీకృతం అయితే వేలాదిమంది పేద విద్యార్థులకు లబ్ది చేకూరుతుంది.
– శ్రీవిద్య