టైటాన్ గ్రూప్‌కు చెందిన పాపులర్ జ్యువెల్లరీ బ్రాండ్ తనిష్క్‌కు నెటిజన్ల సెగ తగిలింది. సోషల్ మీడియాలో బాయ్‌కాట్ తనిష్క్ పేరిట నెటిజన్లు పెద్ద ఎత్తున ట్రెండ్ చేశారు. దీంతో తనిష్క్ తాము తాజాగా రూపొందించిన ఓ యాడ్‌ను తొలగించింది. తనిష్క్‌కు చెందిన అన్ని సామాజిక మాధ్యమాల్లో సదరు యాడ్ ప్రస్తుతం కనిపించడం లేదు.
దసరా దీపావళి పండుగల నేపథ్యంలో తనిష్క్ కొత్త బంగారు ఆభరణాల కలెక్షన్‌ను చూపిస్తూ ఏకత్వం పేరిట ఓ యాడ్ తీసింది. అయితే అది కొందరికి నచ్చలేదు. దీంతో వారు సోషల్ మీడియాలో తనిష్క్‌పై ఫైరయ్యారు. వెంటనే ఆ యాడ్‌ను తొలగించాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. అది లవ్ జిహాద్‌ను ప్రేరేపించే విధంగా ఉందంటూ మండిపడ్డారు. దీంతో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చే సరికి తనిష్క్ ఆ యాడ్‌ను తొలగించింది.
Tanishq has officially withdrawn their ad after being trolled viciously. Here's why this is a very sad state of affairs, and context from other such ads that were trolled (and some, withdrawn) https://t.co/Nb0cSiTPHX pic.twitter.com/sn3IMBqdmC
— Karthik (@beastoftraal) October 13, 2020
కాగా ఆ యాడ్‌లో గర్భంతో ఉన్న ఓ హిందూ మహిళకు తన ముస్లిం అత్తింటి వారు శ్రీమంతం వేడుక చేస్తారు. అందులో ఆభరణాల గురించి చూపిస్తారు. ఆ యాడ్‌లో ఆ మహిళ తన అత్తను అమ్మ అని సంబోధిస్తుంది. ఈ కార్యక్రమం మీ ఇండ్లలో జరగదు కదా.. అని ఆమె తన అత్తను అడుగుతుంది. అందుకు ఆమె.. కుమార్తెలను సంతోషంగా ఉంచడం కోసం ప్రతి ఇంట్లోనూ ఇలాంటి కార్యక్రమాలను ఏర్పాటు చేయాలి.. అంటుంది. అయితే దీనిపై సోషల్ మీడియా రెండుగా విడిపోయింది. కొందరు ఈ యాడ్ బాగుందని, చక్కని సందేశం ఇచ్చారని, దేశంలో ప్రజలంతా కుల మతాల పట్టింపులు లేకుండా కలసి మెలసి ఉండాలని కామెంట్లు పెట్టారు. కానీ కొందరు మాత్రం ఈ యాడ్‌ను తీవ్రంగా వ్యతిరేకించారు. అయితే ఎట్టకేలకు తనిష్క్ ఈ యాడ్‌ను తీసేసింది. కానీ ఆ సంస్థపై విమర్శల వెల్లువ మాత్రం తగ్గడం లేదు. అలాగే ఇంకో వర్గం వారు తనిష్క్‌ను అభినందించడమూ ఆపలేదు.