ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారి ప్రభావం ఇంకా తగ్గలేదు. రోజు రోజుకీ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఈ క్రమంలోనే చలికాలం వస్తుంది కనుక మరింత అప్రమత్తంగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే అమెరికాలోని సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) విడుదల చేసిన నివేదిక ప్రకారం రెండు విషయాల్లో జాగ్రత్తగా ఉండాలని, లేదంటే కరోనా సోకే అవకాశాలు 4 రెట్లు పెరుగుతాయని తేలింది.
సాధారణంగా స్టైల్ కోసం పురుషులు గడ్డం, మీసాలు పెంచుకుంటుంటారు. అయితే కరోనా కోసం మాస్క్ ధరిస్తే కేవలం నోరు, ముక్కులకు మాత్రమే మాస్క్ కవర్ ఇస్తుంది. కానీ మీసాలు, గడ్డం కవర్ కావు. ఈ క్రమంలో వాటిపై వైరస్ చేరే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కనుక పురుషులు గడ్డాలు, మీసాలను తీసేయాల్సి ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు. లేదా బయటికి వెళ్లి వచ్చాక శుభ్రం చేసుకోవాలని అంటున్నారు.
ఇక చేతి వేళ్ల గోర్లలో బాక్టీరియా, వైరస్లు ఎక్కువగా ఉంటాయని, కరోనా వైరస్ గోర్లకు వ్యాపించాక అక్కడి నుంచి మన నోటికి, ముక్కుకు సులభంగా వ్యాపిస్తుందని, కొందరికి గోళ్లు కొరికే అలవాటు ఉంటుందని, కనుక ఎవరైనా సరే.. గోర్ల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. బయటకు వెళ్లి ఏదైనా టచ్ చేశాక వెంటనే హ్యాండ్ శానిటైజర్‌తో శుభ్రం చేసుకోవాలని, ఇంటికి వచ్చాక హ్యాండ్ వాష్ తో చేతులను శుభ్రంగా కడుక్కోవాలని అంటున్నారు. అలాగే గోర్లను పెరగకుండా ఎప్పటికప్పుడు కత్తిరించుకోవాలని, గోర్లలో మట్టి చేరకుండా శుభ్రంగా ఉంచుకోవాలని సూచిస్తున్నారు. ఈ విధంగా పాటించడం వల్ల కరోనా వ్యాప్తిని అడ్డుకోవచ్చని అంటున్నారు.