సుశాంత్‌ కేసులో బాలీవుడ్‌ రివర్స్‌ ఎటాక్‌…! 

-

సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ మృతి బాలీవుడ్‌లో కలకలం రేపింది. బీటౌన్‌కు చెందిన 34 ప్రొడక్షన్‌ హౌస్‌లు ఢిల్లీ హైకోర్టులో పిటిషన్‌ వేయడం సంచలనం రేకెత్తిస్తోంది. హీరో సుశాంత్‌ సింగ్‌ అనుమానాస్పద మృతి బాలీవుడ్‌ను బాగా బద్నాం చేసింది. నెపొటిజం మొదలు డ్రగ్స్‌ వ్యవహారం వరకు.. చాలా విషయాలు వెలుగులోకి వచ్చాయి. బాలీవుడ్ దిగ్గజాలుగా చెప్పుకునే చాలామంది పేర్లు వినిపించాయి.

అయితే, ఇప్పుడు బాలీవుడ్‌లోని పలువురు ప్రముఖులు, నిర్మాణ సంస్థలు.. మీడియాపై రివర్స్‌ అటాక్‌ మొదలు పెట్టాయి. ప్రతికూల ప్రచారం వల్ల కొన్ని వేల మంది సినీ కార్మికుల జీవితాలు ఇబ్బందుల్లో పడుతున్నాయని.. బాలీవుడ్‌ నటులందరూ క్రిమినల్స్‌ అన్నట్లుగా.. బాలీవుడ్‌ డ్రగ్స్‌ను ప్రొత్సహిస్తుందన్నట్లుగా చేస్తున్న ప్రచారం వల్ల ప్రజల్లో బాలీవుడ్‌ అంటే ఒక తీవ్రమైన వ్యతిరేకత ఏర్పడిందనీ.. కోర్టులో పిటిషన్‌ వేశారు.

సినిమాల విషయంలో ఎవరికివారుగా ఉంటూ, పోటీగా ఫీలవుతూ ముఖాలు కూడా చూసుకోవడానికి ఇష్టపడని ఖాన్‌లు, కపూర్‌లు, భట్‌లు.. ఇప్పుడు మీడియాపై కేసు వేసేందుకు మాత్రం ఒక్కటయ్యారు. వీరంతా కలిసి ఢిల్లీ హైకోర్టులో మీడియాకు వ్యతిరేకంగా దాఖలు చేసిన వెయ్యి69 పేజీల పిటిషన్‌ దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తిస్తోంది.

బాలీవుడ్‌ను శాసించే ప్రొడక్షన్‌ హౌస్‌లన్నీ ఈ పిటిషన్‌లో భాగస్వాములవటం చరిత్రలో నిలిచిపోయే విషయమని విమర్శకులు అంటున్నారు. భారతీయ సినీ చరిత్రలో ఈ తరహా పోరాటం ఎప్పుడు జరగలేదనీ చెబుతున్నారు. నిజానికి, సుశాంత్‌ మృతితో బాలీవుడ్‌లో ఉన్న చీలికలన్నీ బయటకు వచ్చాయి. కరణ్‌ జోహార్‌, సల్మాన్‌ ఖాన్‌, అలియా భట్‌ వంటి నటులపై సోషల్‌ మీడియాలో ట్రోలింగ్‌ కూడా జరిగింది. ఈ వ్యవహారం డ్రగ్స్‌ కోణంలోకి మారడంతో… బీటౌన్‌ మొత్తం మత్తుతో నిండిపోయిందనే ప్రచారం జరిగింది. దీంతో అప్పటివరకూ సైలెంట్‌గా ఉన్న ఖాన్‌ త్రయంతో పాటు ఇతర ప్రముఖులందరూ కలిసి ఇలా మీడియాపై కేసు వేసినట్టు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news