హైదరాబాద్ పరిధిలో భారీ వర్షాలు, వరదల వల్ల చెరువులకు ప్రమాదం జరగకుండా అధికార యంత్రాంగం అంతా అప్రమత్తంగా ఉండాలని తెలంగాణా సీఎం కేసీఆర్ ఆదేశించారు. కనీసం 15 స్పెషల్ టీమ్స్ ఏర్పాటు చేసి, నగరంలోని అన్ని చెరువులను పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ, అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. నీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రజత్ కుమార్ తో ఈరోజు సిఎం కేసీఆర్ ఈ మేరకు సమీక్ష జరిపారు.
హైదరాబాద్ నగరంలో గత వందేళ్లకాలంలో ఎన్నడూ లేని విధంగా భారీ వర్షాలు కురిసిన నేపధ్యంలో పెద్ద ఎత్తున వరద నీరు వచ్చింది. నగరంలోని వరద నీటితో పాటు, చుట్టు పక్కల ప్రాంతాల నుంచి చెరువుల ద్వారా కూడా చాలా నీరు హైదరాబాద్ నగరంలోని చెరువులకు చేరి చెరువులన్నీ పూర్తిగా నిండిపోయాయి. అంతే కాక మళ్ళీ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించిన నేపథ్యంలో అధికార యంత్రాంగం చెరువుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని ఆయన ఆదేశించారు. వరద నీరు వస్తున్నందున చెరువుకట్టలకు గండి పండడం, కట్టలు తెగడం లాంటి ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు.