ఎమ్మెల్యే కొడుకు మాస్ కాపీయింగ్ తో ఏపీలో కొత్త పంచాయతీ…!

-

తండ్రి అధికార పార్టీ ఎమ్మెల్యే. పైగా ఆధునిక టెక్నాలజీ అందుబాటులో ఉంది. తిరుగే ఉండబోదని అనుకున్నాడో ఏమో.. గుంటూరు జిల్లా తెనాలి డివిజన్‌కు చెందిన అధికారపార్టీ ఎమ్మెల్యే చిన్న కుమారుడు ఏకంగా MBBS ఫైనల్‌ ఇయర్‌ పరీక్షల్లో కాపీయింగ్‌కు పాల్పడ్డాడు. చెవిలో బడ్స్‌ పెట్టుకుని.. అది కనిపించకుండా దూది అడ్డంపెట్టి బ్లూటూత్‌ సాయంతో హైటెక్‌ కాపీయింగ్‌కు పాల్పడుతూ రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయాడు. సెప్టెంబర్‌ 24న జరిగిన ఈ ఘటన ప్రస్తుతం అనేక మలుపులు తిరుగుతోంది.

అవతలి వ్యక్తులు సమాధానాలు చెబుతుంటే సూపర్‌ ఫాస్ట్‌లో ఆన్సర్లు రాస్తున్న ఎమ్మెల్యే కుమారుడిపై అనుమానం వచ్చి చెక్‌ చేశారు ఎగ్జామ్‌ పరీశీలకురాలిగా వచ్చిన మహిళా డాక్టర్‌. అప్పటి వరకూ చదివిన వైద్యశాస్త్రంలో ఏ మాత్రం పట్టుసాధించాడో ఏమో కానీ.. టెక్నాలజీలో అతగాడి నైపుణ్యం చూసి ఆశ్చర్యపోయారట ఎగ్జామినర్స్‌. రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిన సదరు స్టూడెంట్‌ను డిబార్‌ చేయాలని యూనివర్సిటీకి సిఫారసు చేశారు మహిళా డాక్టర్‌. డిబార్‌ చేస్తే మూడేళ్ల వరకూ పరీక్షలు రాయడానికి వీలుండదు.

సీన్‌ కట్‌ చేస్తే.. నా కుమారుడినే డిబార్‌ చేస్తారా? అంటూ అధికార పార్టీ ఎమ్మెల్యే అయిన ఆ విద్యార్ధి తండ్రి చిందులు తొక్కారట. తోటి ఎమ్మెల్యేల సాయంతో.. సీఎం కార్యాలయానికి దగ్గర సంబంధం ఉన్న నాయకుడి సహకారంతో యూనివర్సిటీ అధికారులపై ఒత్తిడి తెస్తున్నారట. అయితే అధికారులు మాట వినకపోవడంతో.. వెంటనే కులంకార్డు బయటకు తీశారట. దీంతో వర్సిటీ అధికారులు తల పట్టుకున్నారట. అంతేకాదు.. ఎమ్మెల్యే కుమారుడు కాపీయింగ్‌ చేస్తుండగా పట్టుకున్న మహిళా డాక్టర్‌పైనా డిబార్‌ చర్యలు వెనక్కి తీసుకోవాలని ఒత్తిడి తెస్తున్నట్టు సమాచారం. అవసరమైతే మళ్లీ పరీక్షలు పెట్టాలని ఒత్తిడి తీసుకొస్తున్నారట.

ఈ ఘటనపై వస్తున్న ఒత్తిళ్లు తట్టుకోలేకపోయారో ఏమో హెల్త్‌ యూనివర్సిటీ అధికారులు ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారని సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news