సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ త్వరలో పెట్టబోతున్న రాజకీయ పార్టీ పేరు పై రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. వైసీపీ అధినేత జగన్, మైనింగ్ డాన్ గాలి జనార్దన్ రెడ్డిల పై సీబీఐ కేసు నమోదుతో రాష్ట్ర వ్యాప్తంగా ఫేమస్ అయిన లక్ష్మీనారాయణగా ‘జేడీ’గా సుప్రసిద్ధుడైన విషయం తెలిసిందే. ఈ మధ్య ప్రజా సేవ చేసేందుకు తన పదవికి స్వచ్ఛంద విరమణ చేసిన ఆయన రాజకీయాల్లో అడుగు పెట్టేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఇందులో భాగంగానే తెలుగు రాష్ట్రాల్లో వివిధ ప్రాంతాల్లో క్షేత్ర స్థాయిలో పర్యటిస్తున్నారు. దీంతో త్వరలోనే ఆయన కొత్త పార్టీని ప్రారంభిస్తున్నట్లు వస్తున్న ప్రచారానికి మరింత బలం చేకూరుతుంది.
జేడీ అనే పేరు మాదిరిగానే ‘జన ధ్వని’ (జేడీ) అని పెట్టవచ్చని ప్రచారం జరుగుతోంది. లేదా వందేమాతరం అనే పేరు సైతం ప్రచారంలో ఉంది. అయితే లక్ష్మీనారాయణ సన్నిహిత వర్గాలు మాత్రం ఏ పేరునూ ధ్రువీకరించటం లేదు. అలాగని వీటిని ఖండించటమూ లేదు. జేడీ పేరు పైనే లక్ష్మీనారాయణ ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. ఈనెల 26వ తేదీన ఆయన పార్టీ ఏర్పాటు ప్రకటన చేసేందుకు హైదరాబాద్లోని పబ్లిక్ గార్డెన్స్ వేదిక కానున్నట్లు తెలిసింది. ఈ సమావేశానికి ఇప్పటికే కొంత మంది ప్రముఖులకు ఆహ్వానాలు పంపినట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా జేడీ లక్ష్మీనారాయణ లాంటి వారు రాజకీయాల్లోకి రావడం మంచిదే కానీ… ఆయన స్థాపించే పార్టీ మరో లోక్ సత్తాలా మారకూడదని సర్వత్రా చర్చించుకోవడం విశేషం.